ఈ రాత్రి హైదరాబాదులో ఫ్లైఓవర్ల మూసివేత... ఎందుకంటే...!

  • షబ్-ఎ-మెరాజ్ సందర్భంగా నేటి రాత్రి హైదరాబాద్‌లో పలు ఫ్లైఓవర్ల మూసివేత
  • రాత్రి 10 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వస్తాయని ప్రకటన
  • పురానాపూల్ ఘటన నేపథ్యంలో పాతబస్తీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
  • కొన్ని ఫ్లైఓవర్లకు మినహాయింపు, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచన
  • ప్రార్థనా స్థలాల వద్ద ప్రత్యేక పోలీసు బలగాల మోహరింపు
ముస్లింలు పవిత్రంగా జరుపుకునే 'షబ్-ఎ-మెరాజ్' సందర్భంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం రాత్రి 10 గంటల తర్వాత నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నట్లు ప్రకటించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న నెక్లెస్ రోడ్డును కూడా మూసివేయనున్నారు.

అయితే గ్రీన్‌ల్యాండ్స్ ఫ్లైఓవర్, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, లంగర్ హౌస్ ఫ్లైఓవర్లకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ వెల్లడించారు. తెలంగాణ తల్లి, షేక్‌పేట్, బహదూర్‌పురా ఎక్స్ రోడ్ ఫ్లైఓవర్లను అవసరాన్ని బట్టి మూసివేస్తామని చెప్పారు. ప్రజలు ఈ మార్పులను గమనించి, ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని, పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. అత్యవసరమైతే ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 కు కాల్ చేయవచ్చని సూచించారు.

మరోవైపు, ఇటీవల పాతబస్తీలోని పురానాపూల్‌లో జరిగిన మత ఘర్షణల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జనవరి 14న రాత్రి ఓ దుండగుడు మైసమ్మ ఆలయంలోని ఫ్లెక్సీ, విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశాడు. దీనికి ప్రతిగా సుమారు 300 మంది గుంపుగా చేరి సమీపంలోని 'చిల్లా'పై దాడి చేశారు. ఈ ఘటనల నేపథ్యంలో పాతబస్తీలోని సున్నితమైన ప్రదేశాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. ఆలయంలో విధ్వంసానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు, రెండు ఘటనలపైనా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


More Telugu News