ఎలాన్ మస్క్‌కు మరోసారి షాక్ ఇచ్చిన అష్లీ క్లెయిర్

  • మస్క్‌కు చెందిన గ్రోక్ ఏఐపై అష్లీ దావా
  • తనను అశ్లీలంగా చూపించే చిత్రాలను సృష్టిస్తోందన్న అష్లీ
  • నష్టపరిహారం కోరినట్టు సమాచారం

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన గ్రోక్ (Grok) ఏఐ చాట్‌బాట్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏఐ ద్వారా అనుమతి లేకుండా అశ్లీల, అసభ్యకరమైన డీప్‌ఫేక్ చిత్రాలు రూపొందుతున్నాయని, ముఖ్యంగా మహిళలు, పిల్లల ఫొటోలను లక్ష్యంగా చేసుకుంటున్నారన్న ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.


ఈ క్రమంలో ఎలాన్ మస్క్‌కు మరో న్యాయసంబంధ సమస్య ఎదురైంది. ప్రముఖ రచయిత్రి ఆష్లీ సెయింట్ క్లెయిర్ మస్క్‌కు చెందిన xAI సంస్థపై న్యూయార్క్ స్టేట్ సుప్రీం కోర్టులో దావా వేసినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.


తన అనుమతి లేకుండానే గ్రోక్ ఏఐ తనను అశ్లీలంగా చూపించే డీప్‌ఫేక్ చిత్రాలను రూపొందిస్తోందని ఆష్లీ తన పిటిషన్‌లో ఆరోపించారు. వినియోగదారులు ఇచ్చే ప్రాంప్ట్‌ల ఆధారంగా గ్రోక్ తన ప్రతిష్ఠకు భంగం కలిగించే రీతిలో చిత్రాలను సృష్టిస్తోందని పేర్కొన్నారు. గతంలో ఈ విషయాన్ని సంస్థ దృష్టికి తీసుకెళ్లానని... వాటిని నిలిపివేస్తామని అప్పుడు తనకు చెప్పి మళ్లీ అలాంటి కంటెంట్ రూపొందిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే ఈ చర్యలను ఆపాలని, తనకు తగిన నష్టపరిహారం చెల్లించాలని ఆమె కోర్టును కోరినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఇప్పటివరకు ఎక్స్ లేదా xAI నుంచి అధికారిక స్పందన వెలువడలేదు.


గతంలో కూడా ఎలాన్ మస్క్‌పై అష్లీ సంచలన ఆరోపణలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఎలాన్ మస్క్‌తో తనకు సంబంధం ఉందని, తామిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నాడని ఆమె వెల్లడించారు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచేందుకు తనకు 15 మిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు కూడా అప్పట్లో ఆమె తెలిపారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి.



More Telugu News