తెనాలిలో 158 వంటకాల రికార్డును మించిపోయేలా... విశాఖలో 290 వంటకాలతో అల్లుడికి విందు

  • నర్సీపట్నంలో కొత్త అల్లుడికి అత్తమామల ఘన స్వాగతం
  • తొలి సంక్రాంతికి ఏకంగా 290 రకాల పిండి వంటలతో విందు
  • అల్లుడి వయసు 29 ఏళ్లు కావడంతో పక్కన సున్నా చేర్చి 290 ఐటమ్స్ ఏర్పాటు
  • వంటకాలను చూసి ఆశ్చర్యానికి గురైన కొత్త అల్లుడు శ్రీహర్ష
గోదారోళ్ల ఆతిథ్యం అంటే ఎలా ఉంటుందో నర్సీపట్నంకు చెందిన ఓ జంట రుచి చూపించింది. తమ కొత్త అల్లుడికి తొలి సంక్రాంతి పండుగ సందర్భంగా ఏకంగా 290 రకాల పిండి వంటలతో భారీ విందు ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ అరుదైన ఆతిథ్యం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది.

వివరాల్లోకి వెళితే.. నర్సీపట్నం మున్సిపాలిటీలోని శాంతి నగర్‌లో నివసించే నాళం రమేశ్ కుమార్, కళావతి దంపతులు తమ కుమార్తె లక్ష్మీ నవ్యను శ్రీహర్షకు ఇచ్చి ఇటీవల వివాహం జరిపించారు. కొత్త అల్లుడు శ్రీహర్ష (29)కు ఇది తొలి సంక్రాంతి కావడంతో పండగను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనుకున్నారు. ఇందులో భాగంగా, అల్లుడి వయసు 29కి పక్కన 'సున్నా' చేర్చి ఏకంగా 290 రకాల వంటకాలను సిద్ధం చేశారు.

ఇవాళ భోజనానికి వచ్చిన అల్లుడు శ్రీహర్ష, తన కోసం సిద్ధం చేసిన వంటకాలను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తన కళ్ల ముందు కనిపిస్తున్న వందల రకాల ఐటమ్స్‌ను చూసి విస్మయానికి గురయ్యాడు. ఈ సంక్రాంతికే గుంటూరు జిల్లా తెనాలిలో ఓ అల్లుడికి 158 రకాలతో విందు ఏర్పాటు చేయడం వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఆ సంఖ్యను మించిపోయేలా నర్సీపట్నం దంపతులు 290 వంటకాలతో విందు ఇచ్చి తమ అల్లుడిపై ఉన్న ప్రేమను చాటుకోవడం విశేషం.


More Telugu News