ఆర్మీ, ప్రభుత్వం మధ్య సమస్యలు.. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆర్మీ అధికారులతో భేటీ

  • కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్
  • రాష్ట్రానికి సైనిక్ స్కూల్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
  • సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక అధికారులను నియమించాలన్న రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, తెలంగాణ-ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, డీజీపీ శివధర్ రెడ్డి, ప్రభుత్వ, ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్మీ, ప్రభుత్వం మధ్య భూసమస్యలు, ఇతర పరిపాలనాపరమైన అంశాల పరిష్కారంపై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆర్మీ ఉన్నతాధికారులకు పలు విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రంలో సైనిక్ స్కూలును ఏర్పాటు చేయాలని కోరారు. వివిధ రాష్ట్రాలకు గత పదేళ్లలో రెండు అంతకుమించి సైనిక్ స్కూళ్లు వచ్చాయని, కానీ తెలంగాణకు ఈ కాలంలో ఒక్కటి కూడా మంజూరు చేయలేదని గుర్తు చేశారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌కు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు.

దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని, ఇందులో భాగంగా వికారాబాద్‌లో లో-ఫ్రీక్వెన్సీ నేవీ రాడర్ స్టేషన్‌కు 3 వేల ఎకరాలను కేటాయించినట్లు తెలిపారు. ఆర్మీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య సమస్యల పరిష్కారం కోసం ఆర్మీ వైపు నుంచి ప్రత్యేక అధికారులను నియమిస్తే చర్చలు జరపడం సులభమవుతుందని అన్నారు. అప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని ఆకాంక్షించారు.


More Telugu News