ఐప్యాక్ కేసులో మమతపై ఈడీ ఆరోపణలు.. చాలా సీరియస్ మ్యాటర్ అన్న సుప్రీంకోర్టు

  • ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాలను అడ్డుకున్న మమత
  • ఈడీ అధికారుల నుంచి ఫైళ్లను తీసుకెళ్లినట్టు ఆరోపణలు
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈడీ అధికారులు
కోల్ కతాలోని ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వారిని అడ్డుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, ఈడీ అధికారుల నుంచి కీలక ఫైళ్లను ఆమె బలవంతంగా తీసుకెళ్లినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మమత తీరుపై ఈడీ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. 

తమ అధికారుల ఫోన్లు, కీలక డాక్యుమెంట్లను మమతతో పాటు, బెంగాల్ పోలీసులు లాక్కున్నారని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ఫుటేజీని పోలీసులు ధ్వంసం చేశారని చెప్పారు. కలకత్తా హైకోర్టులో వాదనలు వినిపించకుండా తమ లాయర్ ను అడ్డుకున్నారని తెలిపారు. బస్సులు ఏర్పాటు చేసి హైకోర్టుకు జనాలను తరలించారని చెప్పారు. 

దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ  తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది చాలా సీరియస్ మ్యాటర్ అని... దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. కేసు మొత్తాన్ని పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పింది. దీనిపై నోటీసులు జారీ చేస్తామని జస్టిస్ ప్రశాంత్ కుమార్, జస్టిస్ విపుల్ పంచోలీలతో కూడిన ధర్మాసనం తెలిపింది. కేసు విచారణ సందర్భంగా కలకత్తా హైకోర్టు వద్ద చోటుచేసుకున్న గందరగోళంపై కలత చెందామని పేర్కొంది. 



More Telugu News