మహిళా ఐఏఎస్ అధికారులను కించపరిచిన వారిపై చట్టపరంగా చర్యలు: పొన్నం ప్రభాకర్

  • ప్రణాళిక ప్రకారం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి
  • మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా
  • బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శ
మహిళా ఐఏఎస్ అధికారులను కించపరిచే విధంగా వ్యవహరించిన వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మహిళా అధికారులపై ఒక ఛానల్‌లో ప్రసారమైన కథనం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, నిరాధారమైన వార్తలు ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు.

కరీంనగర్‌లోని శ్రీ గిద్దె పెరుమాండ్ల స్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటిందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ, తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ క్యాంటీన్లు వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు.


More Telugu News