విజయ్ సినిమా విడుదలను కేంద్రం అడ్డుకుంటోంది... ఇది తమిళ సంస్కృతిపై దాడి: రాహుల్ గాంధీ

  • విజయ్ సినిమా చుట్టూ రాజకీయ దుమారం
  • తమిళనాడు పర్యటనలో రాహుల్ గాంధీ స్పందన 
  • సీబీఎఫ్‌సీని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శ
  • అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విజయ్ పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నమంటున్న విశ్లేషకులు
తమిళ స్టార్ నటుడు, రాజకీయ నేత విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమా విడుదలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చర్యలను ఆయన ఖండిస్తూ, ఇది తమిళ సంస్కృతిపై జరుగుతున్న దాడి అని అభివర్ణించారు.

"జన నాయగన్ విడుదలను అడ్డుకోవాలనే ప్రయత్నం తమిళ సంస్కృతిపై దాడి చేయడమే. మోదీ గారూ, మీరు తమిళ ప్రజల గొంతును ఎప్పటికీ నొక్కలేరు" అని రాహుల్ గాంధీ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. 

విజయ్ రాజకీయ ప్రవేశం తర్వాత వస్తున్న ఈ చివరి సినిమా విడుదలను మద్రాస్ హైకోర్టు నిలిపివేసిన సంగతి తెలిసిందే. సినిమాలో రాజకీయంగా సున్నితమైన 50కి పైగా సంభాషణలు, మాజీ సీఎం ఎంజీఆర్ ప్రస్తావన, రక్షణ దళాల చిత్రీకరణపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ వివాదం మొదలైంది. దీంతో చిత్ర నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

మంగళవారం నీలగిరి జిల్లా పర్యటనలో ఉన్న రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అధికార డీఎంకేతో పొత్తుల విషయంలో విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో, రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే)కు దగ్గరయ్యే వ్యూహంలో భాగంగానే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

తమిళనాడు పర్యటన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు రాహుల్‌ను 'తలైవా (నాయకుడు)' అంటూ పోస్టర్లు వేయడం డీఎంకేతో సీట్ల పంపకాల చర్చల్లో తమ బలాన్ని చాటుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది.

ఈ వివాదంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందిస్తూ... సీబీఎఫ్‌సీని బీజేపీ ఒక ఆయుధంగా వాడుతోందని విమర్శించారు. అయితే, బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ దీన్ని ఖండించారు. సీబీఎఫ్‌సీ ఒక స్వతంత్ర సంస్థ అని, ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ భావప్రకటనా స్వేచ్ఛను అణిచివేసిందని ఆమె గుర్తుచేశారు. 


More Telugu News