K Kavitha: నేను పార్టీని ప్రకటించాక చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయి: కవిత ఆసక్తికర వ్యాఖ్య

K Kavitha Announces New Political Party with Surprises
  • ఢిల్లీ మద్యం కేసు ఇంకా ఉందని బీజేపీ నేతలు మాట్లాడటం విడ్డూరమన్న కవిత
  • తనను ఐదు నెలల పాటు జైల్లో పెట్టి క్షోభకు గురి చేశారన్న కవిత
  • సమస్యలు ఉన్నచోట ఎప్పుడూ షో చేయడానికి వెళ్లలేదన్న కవిత
  • గాంధీ సరోవర్ ప్రాజెక్టు కింద గాంధీ విగ్రహం పెట్టడం తప్పుకాదని వ్యాఖ్య
తాను రాజకీయ పార్టీని ప్రకటించిన తర్వాత చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండు నెలల్లో కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు తెలిపారు. రాజకీయం చేయాలంటే ధైర్యం ఉండాలని, ఓటమిని సైతం అంగీకరించే మనస్తత్వం ఉండాలని అన్నారు.

ఢిల్లీ మద్యం పాలసీ కేసు ఇంకా ఉందని బీజేపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. తనను ఐదు నెలల పాటు జైల్లో పెట్టి క్షోభకు గురిచేశారని అన్నారు. తనకు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఎవరూ పెద్దగా తెలియదని వెల్లడించారు. సంజయ్ సింగ్ ఎంపీ కాబట్టి పరిచయం ఉండేదని అన్నారు. మద్యం కేసులో క్లీన్ చిట్ వచ్చాక మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు తనను అరెస్టు చేసినప్పుడు ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు.

నేను షో చేయడానికి వెళ్లను

సమస్యలు ఉన్నప్పుడు తాను షో చేయడానికి ఎప్పుడూ వెళ్లనని కవిత తెలిపారు. కుమ్మెర జాతర ఘటనపై తాను ఆ రోజే ఎస్పీతో మాట్లాడానని వెల్లడించారు. నిందితులకు తగిన శిక్ష పడాలని బాధిత కుటుంబం, తాము కోరుకుంటున్నామని అన్నారు.

సమాజం పట్ల మన కంటే లక్ష రెట్ల అవగాహన మావోయిస్టు అగ్రనేతలకు ఉందని కవిత పేర్కొన్నారు. నేను సమాజంలో ఉండి పోరాడితే, వారు అడవుల్లో ఉంటూ సమాజం కోసం పోరాటం చేస్తున్నారని ప్రశంసించారు. మావోయిస్టులు లొంగిపోయి సిద్ధాంతాన్ని బ్రతికించారని అన్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కింద గాంధీ విగ్రహం పెట్టడాన్ని తప్పుపట్టదలుచుకోలేదని కవిత తెలిపారు. కానీ ఈ ప్రాజెక్టు కోసం అన్ని ఇళ్లు కూలగొట్టడం ఎందుకని ప్రశ్నించారు.
K Kavitha
Telangana Jagruthi
BRS
Political party
Delhi liquor scam
AAP
Sanjay Singh
Maoists

More Telugu News