సంక్రాంతికి ఒక్కటైన నేతలు... వైరల్ అవుతున్న నేతల ఏఐ వీడియో

  • రాజకీయ ప్రత్యర్థులు కలిసి సంక్రాంతి చేసుకుంటున్నట్టు ఏఐ వీడియో
  • బాబు, జగన్, పవన్, రేవంత్, కేసీఆర్ కలిసి పండుగ చేసుకుంటున్నట్లు చిత్రీకరణ
  • భోగి మంటలు, పొంగలి, గాలిపటాలతో నేతల సందడి
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏఐ వీడియో
రాజకీయాల్లో బద్ధ శత్రువులుగా ఉండే నేతలంతా ఒక్కచోట చేరి పండుగ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఊహకే అందని ఈ దృశ్యాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కళ్లకు కట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నేతలైన చంద్రబాబు, పవన్ కల్యాణ్, జగన్, రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ అంతా కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నట్లుగా సృష్టించిన ఒక ఏఐ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ వీడియో నెట్టింట సందడి చేస్తోంది. పచ్చని పొలాల మధ్య నేతలు నడుచుకుంటూ వెళ్లడం, భోగి మంటలు వేయడం, పొంగలి వండటం, ఆవులకు నైవేద్యం పెట్టడం, గాలిపటాలు ఎగరేయడం, ఒకరికొకరు స్వీట్లు పంచుకోవడం వంటి దృశ్యాలతో ఈ వీడియోను  సహజంగా రూపొందించారు. ఈ క్రియేటివ్ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

వైసీపీ మద్దతుదారుడిగా పేర్కొంటున్న ‘పాపాలకేపాప (శాండీ పాప వైఎస్సార్సీపీ)’ అనే ‘ఎక్స్’ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. "అందరూ బాగుండాలి... అందులో నేనుండాలి" అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోకు మంచి  స్పందన లభిస్తోంది. వేలాది వ్యూస్‌తో పాటు, "నిజమైన పండుగ అంటే ఇదే", "ఏఐ సృష్టించిందే అయినా, నేతలంతా ఇలా కలిసి ఉండటం చూడటానికి చాలా అందంగా ఉంది" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 


More Telugu News