మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి?: యాక్టర్ నరేశ్
- రేపు విడుదల అవుతున్న శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి'
- కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు నరేశ్
- ఇది తన కెరీర్‌లో కీలక రోల్ అన్న నరేశ్
శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘నారీ నారీ నడుమ మురారి’ రేపు విడుదల కాబోతోంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేశ్ కీలక పోత్ర పోషించారు. ఈ చిత్రం ప్రీరిలీజ్ ప్రెస్ మీట్‌లో నరేశ్ మాట్లాడుతూ... ‘సామజవరగమన’తో తనలో 2.0 వర్షన్ చూశారని, ఇప్పుడు ఈ సినిమాతో ‘నరేశ్ 3.0’ వర్షన్ చూస్తారని అన్నారు. థియేటర్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి సినిమా ముగిసే వరకు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారని, తన కెరీర్‌లో ఇది బెస్ట్ రోల్ అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇక సినిమాలో తన పాత్రకు రెండో పెళ్లి జరగడం, దానిపై జోక్స్ వస్తుండటంపై స్పందిస్తూ... “సినిమాలో నా పాత్రకు మళ్లీ పెళ్లి అవుతుంది, దానివల్ల వచ్చే ఫన్‌ను అందరూ ఎంజాయ్ చేస్తారు. అయినా మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ఈ కాలంలో ఎంతమంది మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదు?” అంటూ నవ్వుతూ చెప్పారు. జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ సినిమాల్లాగే ఈ చిత్రం కూడా కడుపుబ్బా నవ్విస్తుందని నరేశ్ అన్నారు.