కేంద్ర ప్రభుత్వం ముందు కీలక డిమాండ్ ఉంచిన నేషనల్ క్రిస్టియన్ బోర్డు

  • నేషనల్ మైనార్టీస్ కమిషన్ చైర్మన్ పదవిని డిమాండ్ చేస్తున్న క్రిస్టియన్ బోర్డు
  • గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేసిన జాన్ మస్క్
  • మైనార్టీల సమస్యలను కేంద్ర నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపణ

నేషనల్ మైనార్టీస్ కమిషన్ (ఎన్‌సీఎం) చైర్మన్ పదవి గురించి క్రైస్తవ మైనార్టీల నుంచి బలమైన డిమాండ్ వస్తోంది. తమకు ఛైర్మన్ పదవి ఇవ్వాలని నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ జాతీయ అధ్యక్షుడు, భారత పార్లమెంట్ క్రైస్తవ మైనారిటీ వ్యవహారాల జాతీయ కన్వీనర్ జాన్ మస్క్ కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. ఈసారి చైర్మన్ పదవిని తప్పనిసరిగా క్రైస్తవ మైనార్టీకి కేటాయించాలని, గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన కోరారు. లేనిపక్షంలో, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి పోరాడతామని ఆయన హెచ్చరించారు. ఇది కేవలం రాజకీయ డిమాండ్ కాదని, రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం జరిగే పోరాటమని స్పష్టం చేశారు.


కేంద్రం ఈ విషయంలో ఆలస్యం చేస్తోందని, చైర్మన్‌తో పాటు కమిషన్ సభ్యుల నియామకాలను కావాలనే ఆలస్యం చేస్తూ మైనార్టీల సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని జాన్ మస్క్ ఆరోపించారు. ఇది సాధారణ పరిపాలనా వైఫల్యం కాదని, మైనార్టీలపై జరుగుతున్న అన్యాయాలకు పరోక్ష మద్దతు ఇస్తున్నట్టే అని విమర్శించారు. దేశంలో క్రైస్తవ మైనార్టీలపై దాడులు, ద్వేష ప్రచారం, తప్పుడు కేసులు, మత స్వేచ్ఛ ఉల్లంఘనలు పెరుగుతున్న ఈ సమయంలో... కమిషన్‌ను నిర్వీర్యం చేయడం ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీల హక్కులను కాపాడాల్సిన కమిషన్‌కు చైర్మన్ లేకుండా ఉండటం తీవ్రమైన సమస్య అని పేర్కొన్నారు.


ఈసారి క్రైస్తవ మైనార్టీకి పదవి ఇవ్వకపోతే, అది గతంలో ఇచ్చిన హామీలను ఉల్లంఘించినట్టే అవుతుందని జాన్ మస్క్ హెచ్చరించారు. కేంద్రం వెంటనే స్పందించి, చైర్మన్ పదవిని క్రైస్తవ మైనార్టీకి కేటాయించి నియామక ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.



More Telugu News