ప్రభుత్వ లాంఛనాలతో అప్పల సూర్యనారాయణ అంత్యక్రియలు.. చంద్రబాబు ఆదేశం!

  • ఇంట్లో కాలు జారి పడిపోవడంతో సూర్యనారాయణ తలకు గాయం
  • చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం 6.40 గంటలకు మృతి
  • అంత్యక్రియలకు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కావాలని చంద్రబాబు ఆదేశం
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ (78) తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం తన ఇంట్లో కాలు జారి పడిపోవడంతో ఆయన తలకు గాయమయింది. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి వెంటిలేటర్ పై చికిత్స పొందిన ఆయన నిన్న సాయంత్రం 6.40 నిమిషాలకు మృతి చెందారు. 

సూర్యనారాయణ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. పార్టీకి, రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సూర్యనారాయణ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించారు. అంత్యక్రియలకు టీడీపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. 

సూర్యనారాయణ కుటుంబ సభ్యులతో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మంత్రిగా ఉన్నా ఆయన సాధారణ జీవితం గడిపారని కొనియాడారు. సూర్యనారాయణ చేసిన చక్కని రాజకీయాలు అందరికీ ఆదర్శనీయమని అన్నారు. వారి కుటుంబంపై తనకు ఎప్పటికీ అత్యున్నత గౌరవం ఉంటుందని చెప్పారు.


More Telugu News