ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక!
- డీఏ, డీఆర్ ఎరియర్స్, పెండింగ్ బిల్లుల కోసం రూ. 2,653 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
- పోలీసుల సరెండర్ లీవుల బకాయిల కోసం రూ. 110 కోట్లు మంజూరు
- మొత్తంగా 5.70 లక్షల మందికి సంక్రాంతి వేళ ఆర్థిక ప్రయోజనం
సంక్రాంతి కానుకగా ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీసులు, కాంట్రాక్టర్లకు పెద్ద ఊరటనిచ్చేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల డీఏ, డీఆర్ ఎరియర్స్, పెండింగ్ బిల్లులు, బకాయిల క్లియరెన్స్ కోసం రూ. 2,653 కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.
ఇందులో పెద్ద భాగం డీఏ, డీఆర్ ఎరియర్స్‌కి మంజూరు చేసింది. ఒక పెండింగ్ ఇన్‌స్టాల్‌మెంట్ కోసం రూ. 1,100 కోట్లు విడుదల చేసింది. దీంతో సీపీఎస్ ఉద్యోగుల్లో 2.25 లక్షల మంది, పెన్షనర్లలో 2.70 లక్షల మంది నేరుగా లబ్ధి పొందుతారు. పోలీస్ సిబ్బందికి కూడా సరెండర్ లీవుల బకాయిల కోసం రూ. 110 కోట్లు మంజూరు చేశారు. దీనివల్ల దాదాపు 55 వేల మంది పోలీసులకు ప్రయోజనం కలగనుంది.
ఇక కాంట్రాక్టర్ల విషయానికొస్తే... ఈఏపీ, నాబార్డు, సాస్కీ, సీఆర్ఐఎఫ్ వంటి ప్రాజెక్టుల కింద చేసిన పనుల బిల్లులకు రూ. 1,243 కోట్లు రిలీజ్ అయ్యాయి. అందులోనే 'నీరు-చెట్టు' పథకం బిల్లులకు సుమారు రూ. 40 కోట్లు కేటాయించారు. దీంతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన 19 వేలకు పైగా కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జరగనున్నాయి. మొత్తంగా చూస్తే దాదాపు 5.70 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీసులు, కాంట్రాక్టర్లకు ఈ సంక్రాంతి వేళ ఆర్థిక ప్రయోజనం కలగనుంది.