నాశనమవుతున్న బంగ్లాదేశ్ క్రికెట్.. ఆందోళనలో బంగ్లా ఆటగాళ్లు
- బలహీనపడుతున్న ఇండియా - బంగ్లాదేశ్ సంబంధాలు
- ఇండియాకు తమ జట్టును పంపించబోమన్న బంగ్లా క్రికెట్ బోర్డు
- బంగ్లాదేశ్ లో టీమిండియా ఆడకపోతే ఆ దేశానికి ఆర్థికంగా తీవ్ర నష్టమే
- ఇప్పటికే స్పాన్సర్‌షిప్‌లు తెంచుకుంటున్న ఇండియా కంపెనీలు
- భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవద్దంటున్న బంగ్లా సీనియర్లు
ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత క్రికెట్ జట్టు ఇప్పటి వరకు పాకిస్థాన్‌కు వెళ్లలేదు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు పూర్తిగా ఆగిపోయాయి. పాక్‌లో సెక్యూరిటీ పరిస్థితులు బాగోలేవంటూ ఒకటి, రెండు దేశాలు మినహా ఇతర దేశాల జట్లు కూడా అక్కడికి వెళ్లడం ఆపేశాయి. ఒకప్పుడు ప్రపంచంలోనే టాప్ జట్లలో ఒకటిగా ఉన్న పాకిస్థాన్ క్రమంగా బలహీనపడిపోయి, ఆర్థికంగా కూడా భారీ నష్టాలు చవిచూసింది. ఇప్పుడు అదే రూట్‌లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నడుస్తున్నట్టుంది. ఇండియాతో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ విభేదాల నేపథ్యంలో, బీసీబీ హద్దులు దాటి ప్రవర్తిస్తూ తన భవిష్యత్తును తానే ప్రమాదంలో పడేసుకుంటోంది.
వచ్చే నెలలో ఇండియా, శ్రీలంక ఉమ్మడిగా హోస్ట్ చేస్తున్న టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ జట్టు తన మ్యాచ్‌లన్నీ ఇండియాలోనే ఆడాల్సి ఉంది. కానీ బీసీబీ మాత్రం భద్రతా కారణాలను చూపుతూ... ఆ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చమని ఐసీసీని కోరింది. ఐసీసీ ఆ విన్నపాన్ని తిరస్కరించినా, బంగ్లా జట్టు ఇండియాకు రావడానికి ఇష్టపడటం లేదు.
గత ఏడాది బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత, ఇండియాతో డిప్లొమాటిక్ రిలేషన్స్ బాగా దెబ్బతిన్నాయి. అక్కడి యువత ఇండియాపై విద్వేషం పెంచుకుంటున్నారు. మరోవైపు హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ పరిణామాలు కొనసాగుతున్న తరుణంలో... బంగ్లా ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్‌ను ఐపీఎల్ కు సెలెక్ట్ చేయడంపై ఇండియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో, బీసీసీఐ ఆదేశాల మేరకు కోల్‌కతా నైట్ రైడర్స్ అతన్ని రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో, టీ20 వరల్డ్ కప్ కోసం తమ జట్టును ఇండియాకు పంపబోమని, బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలను ఆపేస్తున్నామని బంగ్లా ప్రకటించింది.
మరోవైపు, ఐసీసీ ఛైర్మన్ గా జై షా ఉండటంతో బీసీబీకి వ్యతిరేకంగా ఐసీసీ నిర్ణయాలు తీసుకునే అవకాశం చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. ప్రపంచ క్రికెట్ ఆదాయంలో 70 శాతానికి పైగా ఇండియా నుంచే వస్తుంది కాబట్టి, బీసీసీఐని కాదని ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు. ఈ నేపథ్యంలో, ముందుకు సాగడం బంగ్లాకు కష్టతరమే.
ఇక ఆటగాళ్ల విషయానికొస్తే, ఈ టెన్షన్స్ వల్ల బంగ్లా ప్లేయర్లలో ఆందోళన పెరిగిపోతోంది. ఇండియాతో సిరీస్‌లు ఆగిపోతే బీసీబీ భారీగా ఆదాయం కోల్పోయి పాక్ బోర్డు లాగే సంక్షోభంలో పడుతుంది. ఇప్పటికే బంగ్లాదేశ్‌లో అల్లర్లు, రాజకీయ కల్లోలం వల్ల సిరీస్‌లు జరగడం లేదు. ఇండియా జట్టు అక్కడికి వెళ్లకపోతే మిగతా దేశాలు కూడా ఆపేస్తాయి. భారతీయ సంస్థలు బంగ్లా టీమ్ స్పాన్సర్‌షిప్‌లు తెంచుకుంటున్నాయని ఇప్పటికే ఆటగాళ్లు భయపడుతున్నారు. మరోవైపు, భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకుంటే దేశ క్రికెట్ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని తమీమ్ ఇక్బాల్ లాంటి సీనియర్ ప్లేయర్లు హెచ్చరిస్తున్నారు.