తొలి వన్డేలో ఆసక్తికరం.. మైదానంలో తమిళం, కామెంటరీలో భాషా వివాదం

  • తొలి వన్డేలో సుందర్‌కు తమిళంలో సూచనలిచ్చిన కేఎల్ రాహుల్
  • కామెంటరీలో ‘జాతీయ భాష’ పై స్పందించిన సంజయ్ బంగర్
  • బంగర్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మొదలైన చర్చ
  • గాయం కారణంగా వన్డే సిరీస్‌కు దూరమైన వాషింగ్టన్ సుందర్
  • తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో టీమిండియా విజయం
వడోదర వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌కు అతని మాతృభాష అయిన తమిళంలో సూచనలు ఇవ్వడం, దీనిపై కామెంటరీ బాక్స్‌లో జరిగిన చర్చ వివాదాస్పదంగా మారింది.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సమయంలో వేగంగా బంతులు వేస్తున్న సుందర్‌ను నెమ్మదిగా వేయమని రాహుల్ స్టంప్ మైక్‌లో తమిళంలో చెప్పాడు. దీనిపై కామెంటేటర్ వరుణ్ ఆరోన్ స్పందిస్తూ సుందర్‌కు బాగా అర్థం కావడం కోసమే రాహుల్ తమిళంలో మాట్లాడి ఉండొచ్చని అన్నారు. 

అయితే, మరో కామెంటేటర్, మాజీ కోచ్ సంజయ్ బంగర్ జోక్యం చేసుకుని తాను ‘జాతీయ భాష (రాష్ట్రీయ భాష)’కే ఎక్కువ విలువిస్తానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. భారత రాజ్యాంగం ప్రకారం దేశానికి జాతీయ భాష అంటూ ఏదీ లేదని, హిందీ, ఇంగ్లిష్ అధికార భాషలుగా ఉన్నాయని పలువురు గుర్తుచేశారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, ఈ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 301 పరుగుల లక్ష్యాన్ని 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ (93), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (56) అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్‌లో గాయపడిన వాషింగ్టన్ సుందర్ మిగిలిన రెండు వన్డేల సిరీస్‌కు దూరమయ్యాడు. సైడ్ స్ట్రెయిన్ కారణంగా అతడు తప్పుకోవడంతో, అతని స్థానంలో ఆయుష్ బదోనిని జట్టులోకి తీసుకున్నారు.


More Telugu News