భారత్‌లో హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టే..!: ఒవైసీ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్

  • ఒవైసీ మాటల వెనుక దేశ విభజన రాజకీయాలే ఉన్నాయన్న కిషన్ రెడ్డి
  • ఓ హిందువు ప్రధాని కావాలని పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ వెళ్లి డిమాండ్ చేయగలరా? అని ప్రశ్నించిన కిషన్ రెడ్డి
  • భారత్‌లో హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టే ఇక్కడ ప్రజాస్వామ్యం కొనసాగుతోందని వ్యాఖ్య
మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఒవైసీ మాటల వెనుక దేశ విభజన రాజకీయాలు ఉన్నాయని ఆయన విమర్శించారు. అవి మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపించారు.

హిజాబ్ ధరించే ముస్లిం మహిళ దేశానికి ప్రధాని కావాలన్న అసదుద్దీన్ ఒవైసీ ఆకాంక్ష వెనుక దేశ విభజన రాజకీయాలు దాగి ఉన్నాయని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఓ హిందువు ప్రధాని కావాలని పాకిస్థాన్, బంగ్లాదేశ్ వెళ్లి డిమాండ్ చేయగలరా? అంటూ ఒవైసీకి సవాల్ విసిరారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. భారత్‌లో హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టే ఇక్కడ ప్రజాస్వామ్యం కొనసాగుతోందన్నారు. లేదంటే పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల్లోని హిందువులకు ఎదురైన పరిస్థితులే ఇక్కడి హిందువులకు ఎదురయ్యేవని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మతాల పేరుతో రాజకీయాలకు తావు ఉండదని స్పష్టం చేశారు. పాతబస్తీలో దళితులు, గిరిజన బస్తీలు, చెరువులను కబ్జా చేసిన చరిత్ర మజ్లిస్ పార్టీదేనని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

ఇదే సమయంలో ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై వస్తున్న విమర్శలపైనా ఆయన వివరణ ఇచ్చారు. పని కావాలని నమోదు చేసుకున్న కూలీలకు 15 రోజుల్లో ఉపాధి కల్పించకపోతే నిరుద్యోగ భృతి చెల్లించేలా వీబీ - జీరాం చట్టంలో నిబంధనలు ఉన్నాయని తెలిపారు. వ్యవసాయ రంగానికి అనుసంధానంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు చెప్పారు. ఒక పథకానికి పేరు మార్పు ముఖ్యం కాదని, ఆ పథకం ద్వారా పేదలకు వాస్తవంగా లబ్ధి కలుగుతుందా లేదా అన్నదే ముఖ్యమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 


More Telugu News