భారతీయులకు జర్మనీ తీపి కబురు: ఇకపై ట్రాన్సిట్ వీసా అవసరం లేదు!

  • జర్మనీ మీదుగా ఇతర దేశాలకు వెళ్లే భారతీయులకు వీసా కష్టాల నుంచి విముక్తి
  • జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్స్ భారత పర్యటనలో కీలక ప్రకటన 
  • రెండు దేశాల మధ్య బలపడనున్న వ్యూహాత్మక సంబంధాలు
  • జర్మనీలో పెరగనున్న భారతీయ విద్యార్థులు, నిపుణుల అవకాశాలు
అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులకు జర్మనీ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. జర్మనీ మీదుగా మూడో దేశానికి వెళ్లే భారతీయ ప్రయాణికులు ఇకపై విడిగా 'ట్రాన్సిట్ వీసా' తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్స్ మధ్య జరిగిన భేటీ అనంతరం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.

సాధారణంగా భారతీయులు జర్మనీ విమానాశ్రయాల ద్వారా ఇతర దేశాలకు వెళ్లాలంటే ట్రాన్సిట్ వీసా తప్పనిసరి. తాజా నిర్ణయంతో పేపర్ వర్క్ తగ్గడమే కాకుండా ప్రయాణం మరింత వేగంగా, సులభంగా సాగుతుంది. ఈ చారిత్రాత్మక నిర్ణయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ఛాన్సలర్ మెర్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇది రెండు దేశాల ప్రజల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు.

ఛాన్సలర్ మెర్స్ తొలిసారిగా భారత్‌లో పర్యటిస్తున్న క్రమంలో విద్య, పరిశోధన, ఉపాధి రంగాలపై ప్రత్యేక చర్చలు జరిగాయి. జర్మనీలో పెరుగుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్యను నేతలు స్వాగతించారు. భారతీయ విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు జర్మనీ ఉద్యోగ మార్కెట్‌లో సులభంగా కలిసిపోయేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

ఉన్నత విద్యారంగంలో భాగంగా ఐఐటీలు, జర్మనీ సాంకేతిక వర్సిటీల మధ్య అనుసంధానంపై ఇరు దేశాలు మొగ్గు చూపాయి. నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) కింద జర్మనీలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్‌లను భారత్‌లో ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ ఆహ్వానించారు. భారతీయ నిపుణులు జర్మనీ ఆర్థిక వ్యవస్థకు అందిస్తున్న తోడ్పాటును ఈ సందర్భంగా మెర్స్ ప్రశంసించారు.


More Telugu News