నార్డ్ ఆంగ్లియా సహకారం.. సాహెబ్‌నగర్ పాఠశాలలో విద్యార్థుల కల సాకారం

  • హైదరాబాద్ సాహెబ్‌నగర్ ZPHSలో కొత్తగా వృత్తి విద్యా ల్యాబ్ ఏర్పాటు
  • నార్డ్ ఆంగ్లియా ఎడ్యుకేషన్ రూ. 35 లక్షల నిధులతో ల్యాబ్ నిర్మాణం
  • 600 మందికి పైగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందనున్న నైపుణ్య శిక్షణ
  • ల్యాబ్ ను ప్రారంభించిన నార్డ్ ఆంగ్లియా ఎడ్యుకేషన్ ఇండియా డైరెక్టర్ వై.సి. చౌదరి 
  • నూతన ల్యాబ్ ప్రారంభంతో విద్యార్థులు, ఉపాధ్యాయులలో ఆనందం
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆధునిక నైపుణ్య శిక్షణ అందించే లక్ష్యంతో హైదరాబాద్‌లోని సాహెబ్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కీలక ముందడుగు పడింది. నార్డ్ ఆంగ్లియా ఎడ్యుకేషన్ ఇండియా లిమిటెడ్ అందించిన రూ. 35 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన "అభయ నార్డ్ ఒకేషనల్ ల్యాబ్"ను మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ ల్యాబ్ ద్వారా 600 మందికి పైగా విద్యార్థులకు వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ అందనుంది.

నార్డ్ ఆంగ్లియా ఎడ్యుకేషన్ ఇండియా డైరెక్టర్ వై.సి. చౌదరి తన బృందంతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరై ల్యాబ్‌ను ప్రారంభించి విద్యార్థులకు అంకితం చేశారు. పాఠశాల హెడ్‌మాస్టర్ దినేశ్ నేతృత్వంలోని బృందం సుమారు మూడు నెలల పాటు అవిశ్రాంతంగా శ్రమించి ఈ ల్యాబ్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టును అభయ ఫౌండేషన్ సమన్వయం చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రీమియం అంతర్జాతీయ పాఠశాలల నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్న  'నార్డ్ ఆంగ్లియా' సంస్థ ఈ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు గత కొంతకాలంగా మద్దతు ఇస్తోంది. ఈ ల్యాబ్ ఏర్పాటుతో తమ చిరకాల స్వప్నం నెరవేరిందని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను అందించడానికి ఈ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు.

స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. ఈ అద్భుతమైన సహాయాన్ని అందించిన నార్డ్ ఆంగ్లియా ఎడ్యుకేషన్‌కు, ప్రాజెక్టును విజయవంతంగా ముందుకు నడిపిన అభయ ఫౌండేషన్‌కు పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

 


More Telugu News