అత్యాధునిక టెక్నాలజీతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు: ఎన్‌హెచ్‌ఏఐపై నితిన్ గడ్కరీ ప్రశంసలు

  • బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ నిర్మాణంలో 4 గిన్నిస్ రికార్డులు
  • నూతన సాంకేతికతతో అద్భుతంగా నిర్మించారన్న గడ్కరీ
  • ఈ రికార్డులు దేశానికి, ఏపీకి గర్వకారణమన్న చంద్రబాబు

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ), రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ సంస్థ కలిసి బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ (NH-544G)లో అసాధారణ వేగంతో రహదారి నిర్మాణం చేసి నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించడం తెలిసిందే. కేవలం ఆరు రోజుల్లోనే 156 లేన్ కిలోమీటర్లు (అంటే 52 కిలోమీటర్ల స్ట్రెచ్‌లో 3-లేన్ వెడల్పు) నిరంతరంగా పేవింగ్ చేశారు. అందులో ఒక రోజు, జనవరి 6న 24 గంటల్లోనే 28.8 కిలోమీటర్లు పూర్తి చేశారు – అదే సమయంలో 10,675 మెట్రిక్ టన్నుల బిటుమిన్ కాంక్రీట్ వేయడం కూడా ఒక ప్రపంచ రికార్డు.


57,500 మెట్రిక్ టన్నుల బిటుమిన్ నిరంతరంగా వేయడం, మరియు మొత్తం 156 లేన్ కి.మీ. పేవింగ్‌తో పాత రికార్డులను మించిపోయారు. ఇవన్నీ ఆధునిక మెషినరీ, భారీ టీమ్ వర్క్‌తో, నాణ్యతలో ఏమాత్రం రాజీ లేకుండా సాధించారు. ఇది ఆరు లేన్ హైవేల్లో జరిగిన అద్భుతం.


ఈ పనితీరుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసలు కురిపించారు. మన ఇంజినీర్లు, అధికారులు అసాధ్యాన్ని సాధ్యం చేశారని, నూతన సాంకేతికతతో త్వరగా, నాణ్యమైన రోడ్లు నిర్మించడం గొప్ప విషయమని అన్నారు. 


ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ పనులపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ నాలుగు గిన్నిస్ రికార్డులు దేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని, నితిన్ గడ్కరీ నాయకత్వంలో ప్రపంచ స్థాయిలో సాధించామని ప్రత్యేకంగా రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్‌ను అభినందించారు.


ఈ రోడ్ పూర్తయితే బెంగళూరు-విజయవాడ మధ్య దూరం 100 కిలోమీటర్లు తగ్గి, ప్రయాణ సమయం 12 గంటల నుంచి 8 గంటలకు తగ్గుతుంది. రాయలసీమ, తీర ప్రాంతాలు బాగా కనెక్ట్ అవుతాయి.




More Telugu News