ఒక్కో కోతికి రూ.25 లక్షలు.. ఎక్కడంటే..!

  • చైనాలో కోతులకు కొరత.. క్లినికల్ ట్రయల్స్ కోసం కోతుల వినియోగం
  • ప్రయోగశాలల్లో కోతులను పెంచుతున్న అధికారులు
  • కరోనా సమయం తర్వాత మళ్లీ ఇప్పుడు ధరలు పీక్ స్టేజీకి..
చైనాలో కోతులకు తీవ్రమైన కొరత ఏర్పడింది. అడవుల్లో పెద్ద సంఖ్యలో కోతులు ఉన్నప్పటికీ పరిశోధనలకు మాత్రం కొరత ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ప్రయోగశాలల్లో మందుల తయారీ ప్రక్రియలో కోతులను ఉపయోగిస్తుంటారు. తయారు చేసిన మందులను వాటిపై ప్రయోగించి ఫలితాలను విశ్లేషిస్తుంటారు. ఇందుకోసం అడవుల నుంచి సేకరించిన కోతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్రీడింగ్ కేంద్రాల్లో పెంచుతారు. వాటికి పుట్టిన రెండో తరం కోతులను మాత్రమే ప్రయోగాలకు వినియోగిస్తారు.

నేరుగా అడవులలో పట్టితెచ్చిన కోతులను మందుల ప్రయోగాలకు వాడడం చట్ట వ్యతిరేకం. పైగా అడవుల్లో తిరిగే కోతులు రకరకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. దీని వల్ల క్లినికల్ ట్రయల్స్ సరైన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. అయితే, బ్రీడింగ్ కేంద్రాల్లో కోతుల పెంపకానికి ఎక్కువ సమయం పడుతోంది. ఒక్కో కోతి ఎదిగి ప్రయోగాలకు అనువుగా మారేందుకు కనీసం నాలుగేళ్లు పడుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ మందుల ప్రయోగాలకు అవసరమైన కోతుల కొరత ఏర్పడింది.

డిమాండ్ విపరీతంగా పెరగడంతో కోతుల ధరలు భారీగా పెరిగాయి. కరోనా సమయంలో ఇదేవిధంగా కోతుల ధరలు పెరగగా.. తర్వాత తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఒక్కో కోతి ధర 1.5 లక్షల యువాన్లు (మన రూపాయల్లో సుమారు రూ.13 లక్షలు) ఉండగా.. ప్రస్తుత డిమాండ్ తో ఒక్కో కోతికి 1.93 లక్షల యువాన్లు (సుమారు రూ.25 లక్షలు) పలుకుతోంది. కొత్త ఔషధాల క్లినికల్ ట్రయల్స్ విపరీతంగా పెరగడం, కోతుల పెంపకంలో నెలకొన్న జాప్యం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అక్కడి వర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల మందుల తయారీ ఖర్చు పెరుగుతోందని.. కొత్త ప్రయోగాలు చేయడానికి మరింత సమయం పడుతోందని పేర్కొంటున్నాయి.


More Telugu News