Sasikala: జయ మరణంపై మౌనం వీడిన శశికళ.. నాటి సంగతుల వెల్లడి

Sasikala Breaks Silence on Jayalalithas Death First Time
  • ఎంజీఆర్ మరణం నాడు జయకు జరిగిన అవమానంతో శపథం చేశానన్న చిన్నమ్మ
  • జయను తానే చంపానన్న ప్రచారంతో తీవ్రంగా బాధపడ్డానని ఆవేదన
  • ప్రభుత్వ పతన నివారణకే పళనిస్వామిని సీఎం చేశానని వెల్లడి
  • పన్నీర్ సెల్వం 'ధర్మయుద్ధం' వెనుక ఎవరో ఉన్నారని వ్యాఖ్య
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలపై ఆమె నెచ్చెలి వి.కె.శశికళ మొదటిసారిగా మౌనం వీడారు. రామనాథపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. జయలలిత రాజకీయ ఎదుగుదలలో తన పాత్ర మొదలు, ఎడప్పాడి పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేయడం వరకు అనేక కీలక విషయాలను వెల్లడించారు.

1987లో ఎంజీఆర్ మరణించినప్పుడు ఆయన పార్థివ దేహం వద్ద జయలలితకు జరిగిన అవమానాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. "ఎంజీఆర్ పార్థివ దేహానికి పూలదండ వేయడానికి వెళ్లిన జయక్కను ఆర్ఎం వీరప్పన్ మద్దతుదారులు కొందరు కిందకు నెట్టేశారు. అప్పుడు ఆమె పడిపోకుండా నేను పట్టుకున్నాను. అవమానంతో రాజకీయాలే వద్దన్న ఆమెకు ధైర్యం చెప్పి, ముఖ్యమంత్రిని చేస్తానని నాడే శపథం చేశాను" అని శశికళ తెలిపారు. జయలలిత మరణంపై జరిగిన కుట్రపూరిత ప్రచారం తనను తీవ్రంగా బాధించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "72 రోజుల చికిత్స తర్వాత ఆమె కోలుకున్నారు. ఇంటికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుండగా గుండెపోటు వచ్చింది. అలాంటిది నేనే ఆమెను హతమార్చానని ప్రచారం చేశారు" అని వాపోయారు.

జయ మరణానంతరం ఎమ్మెల్యేలంతా తనను సీఎం కావాలని కోరినా తాను పన్నీర్ సెల్వంకు అవకాశం ఇచ్చానని శశికళ చెప్పారు. అయితే ఆయనపై ఫిర్యాదులు రావడంతో తానే బాధ్యతలు చేపట్టాలనుకున్నానని, కానీ గవర్నర్ అందుబాటులో లేకపోవడం, కోర్టు తీర్పు వంటి పరిణామాల వల్ల అది సాధ్యపడలేదని వివరించారు. "అన్నాడీఎంకే ప్రభుత్వం కూలిపోకూడదనే ఉద్దేశంతోనే పళనిస్వామిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి నేను జైలుకు వెళ్లాను" అని ఆమె స్పష్టం చేశారు.

పన్నీర్ సెల్వం చేసిన 'ధర్మయుద్ధం' వెనుక వేరే వ్యక్తులు ఉన్నారని, ఆ నిర్ణయమే ఆయనకు ఇప్పుడు సమస్యగా మారిందని శశికళ ఎద్దేవా చేశారు. జయలలిత మరణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై శశికళ మొదటిసారి బహిరంగంగా మాట్లాడటం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
Sasikala
Jayalalitha
Tamil Nadu politics
Edappadi Palaniswami
Panneer Selvam
MGR death
AIADMK
Dharma Yuddham
Tamil Nadu CM
Sasikala press meet

More Telugu News