శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ యూనిట్... పనుల తీరుపై మంత్రి నారా లోకేశ్ స్పందన

  • శ్రీసిటీలో రూ.5,000 కోట్లతో ఎల్జీ భారీ ప్లాంట్ ఏర్పాటు
  • పనులు శరవేగంగా సాగుతున్నాయంటూ మంత్రి లోకేశ్ ట్వీట్
  • భారత్‌లో ఎల్జీకి ఇది మూడో తయారీ యూనిట్
  • 2026 చివరికల్లా ఉత్పత్తి ప్రారంభం, వేల మందికి ఉద్యోగాలు
  • శ్రీసిటీ ఎల్జీ  ప్లాంట్ లో ఫ్రిజ్ లు ఏసీలు, వాషింగ్ మెషీన్ల తయారీ
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ (LG) ఏర్పాటు చేస్తున్న భారీ తయారీ ప్లాంట్ పనులు శరవేగంగా సాగుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. రూ.5,000 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పురోగతిపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు, యువతకు ఉద్యోగ కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ముందుందని చెప్పడానికి ఈ ప్రాజెక్టే నిదర్శనమని పేర్కొన్నారు.

247 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రపంచ స్థాయి తయారీ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. గత ఏడాది మే 2025లో ఈ ప్రాజెక్టుకు భూమిని అప్పగించగా, అతి తక్కువ సమయంలోనే నిర్మాణ పనుల్లో గణనీయమైన పురోగతి సాధించడంపై లోకేశ్ సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌లో ఎల్జీ ఏర్పాటు చేస్తున్న మూడో ప్లాంట్ ఇది. ఈ యూనిట్‌లో రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లతో పాటు కీలకమైన విడిభాగాలను కూడా ఉత్పత్తి చేయనున్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో తయారీ రంగ పర్యావరణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి లోకేశ్ అన్నారు. ప్రణాళిక ప్రకారం 2026 చివరి నాటికి ఈ ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించి, 2029 వరకు దశలవారీగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


More Telugu News