అమిత్ షా కార్యాలయం ఎదుట టీఎంసీ ఎంపీల నిరసన

  • కోల్‌కతాలోని ఐ-ప్యాక్‌ కార్యాలయంలో ఈడీ సోదాలు
  • సోదాలను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగిన టీఎంసీ ఎంపీలు
  • కేంద్ర ప్రభుత్వం ఈడీని ఆయుధంగా వాడుకుంటోందని విమర్శ

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కార్యాలయం ఎదుట తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు నిరసనకు దిగారు. మహువా మొయిత్రా, శతాబ్ది రాయ్‌, కీర్తి ఆజాద్‌, డెరెక్‌ ఓబ్రియన్‌ తదితరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కోల్‌కతాలోని ఐ-ప్యాక్‌ కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్వహించిన సోదాలకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపట్టారు.


రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈడీని ఆయుధంగా మారుస్తోందని తృణమూల్ నేతలు ఈ సందర్భంగా ఆరోపించారు. బెంగాల్‌లో ఓటమిని జీర్ణించుకోలేకే బీజేపీ ఇటువంటి సోదాలు చేయిస్తోందని విమర్శించారు. అమిత్‌ షా ఆదేశాల మేరకే ఈడీ పనిచేస్తోందని నినాదాలు చేశారు.


నిరసన ఉద్ధృతంగా మారడంతో పోలీసులు ఎంపీలను అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. తాము పూర్తిగా శాంతియుతంగా ఆందోళన చేపట్టామని, అయినా పోలీసుల తీరు దురుసుగా ఉందని మహువా మొయిత్రా, డెరెక్‌ ఓబ్రియన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసనలకు కూడా చోటు లేకుండా చేస్తున్నారని వారు అన్నారు.


ఈ పరిణామాలపై తృణమూల్ నేత అభిషేక్‌ బెనర్జీ ఎక్స్ వేదికగా స్పందించారు. నేరగాళ్లకు రివార్డులు, అత్యాచార నిందితులకు బెయిల్ ఇస్తూ, నిరసన వ్యక్తం చేసిన వారిని జైలుకు పంపే విధానం బీజేపీ పాలనలో కొనసాగుతోందని విమర్శించారు. దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతూ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విధానాలను బెంగాల్ ప్రజలు అంగీకరించరని, బీజేపీని ఓడించేందుకు తాము శక్తిమేర కృషి చేస్తామని ఆయన అన్నారు.



More Telugu News