ఏపీలో 13 మంది అధికారులపై ఏసీబీ కేసులు... సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

  • 13 మంది ఏపీ అధికారులపై ఏసీబీ కేసులు
  • ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేసిన ఏపీ హైకోర్టు
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏసీబీ
ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 13 మంది ప్రభుత్వ అధికారులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసుల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును కొనసాగించేందుకు సర్వోన్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. ఈ కేసులకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేస్తూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.

వివాదం నేపథ్యం ఇదే..
2016-2020 మధ్య కాలంలో పలువురు ప్రభుత్వ అధికారులపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ఏసీబీ కేసులు నమోదు చేసింది. విజయవాడలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ) ద్వారా ఈ ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. అయితే, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసే నాటికి సీఐయూను అధికారికంగా పోలీస్ స్టేషన్‌గా నోటిఫై చేయలేదని, కాబట్టి ఆ కేసులకు చట్టబద్ధత లేదని నిందిత అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్టు, ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేసింది.

హైకోర్టు తీర్పును తప్పుబట్టిన సుప్రీం
హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏసీబీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సాంకేతిక కారణాలతో అవినీతి కేసుల దర్యాప్తును అడ్డుకోవడం న్యాయ సూత్రాలకు విరుద్ధమని, ఇది న్యాయ వ్యవస్థకే అవమానకరమని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ, దర్యాప్తు కొనసాగించాలని ఏసీబీని ఆదేశించింది. అయితే, 6 నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని, ఈ సమయంలో అరెస్టు వంటి కఠిన చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. ఇకపై ఇలాంటి సాంకేతిక అంశాలపై దాఖలయ్యే పిటిషన్లను హైకోర్టులు విచారించరాదని కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది.


More Telugu News