ఫోన్ మాట్లాడుతూ 17 వ అంతస్తు నుంచి కిందపడ్డాడు.. నోయిడాలో విషాదం

  • తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించిన వ్యక్తి
  • ఇంట్లో సిగ్నల్ అందట్లేదని బాల్కనీలోకి..
  • సెక్టార్ 104లోని ఓ అపార్ట్ మెంట్ లో దుర్ఘటన
ఇంట్లో సరిగా సిగ్నల్ అందట్లేదని ఫోన్ మాట్లాడేందుకు బాల్కనీలోకి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ అక్కడి నుంచి కిందపడిపోయాడు. 17వ అంతస్తు నుంచి పడిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని అపార్ట్ మెంట్ వాసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆ వ్యక్తి మరణించాడని వైద్యులు తెలిపారు. ఈ విషాదకర సంఘటన నోయిడాలోని సెక్టార్ 104లో ఓ అపార్ట్ మెంట్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కాన్పూర్‌కు చెందిన అజయ్ గార్గ్ (55) ఢిల్లీలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ గా పనిచేస్తున్నారు. భార్యతో కలిసి నోయిడాలోని 'ఏటీఎస్ వన్ హామ్లెట్' సొసైటీలో నివసిస్తున్నారు. శనివారం ఉదయం 10.20 గంటల సమయంలో అజయ్ కు ఫోన్‌ వచ్చింది. ఫ్లాట్ లోపల సిగ్నల్ సరిగా అందకపోవడంతో అజయ్ బాల్కనీలోకి వెళ్లారు. ఫోన్ మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తూ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయారు.

అపార్ట్‌మెంట్ వాసులు హుటాహుటిన అజయ్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా, అజయ్ గార్గ్ మరణం ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.


More Telugu News