టాటాను దాటేసిన మహీంద్రా.. 2025లో కీలక మైలురాయిని దాటిన మహీంద్రా

  • 2025లో 6 లక్షలకు పైగా కార్లను విక్రయించిన మహీంద్రా
  • తొలి స్థానంలో నిలిచిన మారుతి సుజుకి
  • నాలుగో స్థానంలో హ్యుందాయ్

భారత కార్ల మార్కెట్‌లో మహీంద్రా కంపెనీ అదిరిపోయే రికార్డు నమోదు చేసింది. 2025 ఏడాది మహీంద్రాకు చారిత్రాత్మకంగా మారింది. తొలిసారి ఒకే సంవత్సరంలో 6 లక్షలకు పైగా వాహనాలు అమ్ముకుని, దేశంలో రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించింది.

ఇప్పటి వరకు ఈ స్థానం టాటా మోటార్స్ దగ్గర ఉండేది. కానీ ఈసారి మహీంద్రా టాటాను దాటిపోయి, మారుతి సుజుకి తర్వాతి స్థానాన్ని దక్కించుకుంది. హ్యుందాయ్ నాలుగో స్థానంలో నిలిచింది.


2025లో మహీంద్రా మొత్తం 6,25,603 ఎస్యూవీ వాహనాలను విక్రయించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 97 వేల వాహనాలు ఎక్కువ. అంటే కంపెనీపై ప్రజల నమ్మకం ఎంత పెరిగిందన్న దానికి ఇది ఓ నిదర్శనం. అక్టోబర్ నెల అయితే మహీంద్రాకు స్పెషల్‌గా మారింది. ఒక్క నెలలోనే 71,624 వాహనాలు అమ్మి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది.


మహీంద్రా ఈ స్థాయికి చేరడానికి ఈ మోడళ్లు ప్రధాన కారణం:

  • స్కార్పియో (N & క్లాసిక్) – మహీంద్రా నెంబర్ వన్ కారు. జనవరి నుంచి నవంబర్ వరకు 1.61 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి.

  • థార్ (3-డోర్ థార్ రాక్స్) – యువతకు ఫేవరెట్‌గా మారింది. అమ్మకాలు ఏకంగా 55% పెరిగాయి.

  • XUV 3XO, బొలెరో – ఫ్యామిలీ, గ్రామీణ మార్కెట్‌లో మంచి డిమాండ్ తెచ్చాయి.

  • ఎలక్ట్రిక్ కార్లు (BE 6, XEV 9e) – కొత్తగా వచ్చినా మంచి స్పందన. మొత్తం అమ్మకాలలో 7% వాటా సాధించాయి.


మహీంద్రా తీసుకొచ్చిన BE 6, XEV 9e ఎలక్ట్రిక్ SUVలు కూడా ఆకట్టుకున్నాయి. 11 నెలల్లోనే 38,841 యూనిట్లు అమ్ముడయ్యాయి. భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదేనని మహీంద్రా మరోసారి నిరూపించింది.



More Telugu News