బంగ్లాదేశ్‌ తొలి మహిళా ప్రధాని ఖలీదా జియా కన్నుమూత

  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖలీదా జియా
  • కాలేయ సమస్యలు, డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులతో సుదీర్ఘ పోరాటం
  • విషాదంలో బీఎన్‌పీ కార్యకర్తలు, అభిమానులు
బంగ్లాదేశ్ రాజకీయాల్లో ధ్రువతార, ఆ దేశ తొలి మహిళా ప్రధానమంత్రి బేగం ఖలీదా జియా (80) మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆమె నాయకత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) అధికారికంగా ధ్రువీకరించింది.

80 ఏళ్ల ఖలీదా జియా వృద్ధాప్య సమస్యలతో పాటు పలు తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నారు. వైద్యుల కథనం ప్రకారం.. ఆమె కాలేయ వ్యాధి, కీళ్ల నొప్పులు, మధుమేహం, గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని వారాలుగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆసుపత్రిలో ప్రత్యేక నిఘాలో ఉంచి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది.

బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహ్మాన్ భార్య అయిన ఖలీదా జియా.. తన భర్త మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చి దేశాన్ని శాసించారు. మూడు సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆమె, బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కృషి చేశారు. షేక్ హసీనాతో సాగించిన దశాబ్దాల రాజకీయ పోరు బంగ్లాదేశ్ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టం. ఆమె మరణవార్త తెలియగానే బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఉన్న బీఎన్‌పీ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.


More Telugu News