వెండి ధగధగలు.. యాపిల్, ఆల్ఫాబెట్‌లను అధిగమించి మూడో స్థానం

  • టెక్ దిగ్గజాలైన యాపిల్, గూగుల్‌ను దాటేసిన వెండి
  • ప్రపంచంలో మూడో అత్యంత విలువైన ఆస్తిగా గుర్తింపు
  • రెండో స్థానంలో ఉన్న ఎన్విడియాకు అతి చేరువలో వెండి
  • భారత్‌లో కిలో వెండి ధర రూ. 2.33 లక్షల ఆల్-టైమ్ రికార్డ్
  • గత ఏడాదిలో 153 శాతానికి పైగా పెరిగిన ధరలు
ప్రపంచంలోని అత్యంత విలువైన ఆస్తుల జాబితాలో వెండి సంచలనం సృష్టిస్తోంది. టెక్ దిగ్గజాలైన యాపిల్, ఆల్ఫాబెట్‌లను అధిగమించి మూడో స్థానానికి చేరింది. త్వరలోనే ఎన్విడియా కార్పొరేషన్‌ను కూడా దాటి, బంగారం తర్వాత రెండో స్థానాన్ని దక్కించుకునే దిశగా పరుగులు తీస్తోంది.

తాజా గణాంకాల ప్రకారం, వెండి మార్కెట్ క్యాపిటలైజేషన్ 4.220 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రస్తుతం 4.592 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో రెండో స్థానంలో ఉన్న ఎన్విడియాకు, వెండికి మధ్య కేవలం 8.1 శాతం వ్యత్యాసం మాత్రమే ఉంది. ఇక 31.598 ట్రిలియన్ డాలర్లతో బంగారం తిరుగులేని అగ్రస్థానంలో కొనసాగుతోంది.

వెండి ధరల్లో చారిత్రాత్మక ర్యాలీ కారణంగా దాని విలువ అమాంతం పెరిగింది. శుక్రవారం కామెక్స్ మార్కెట్‌లో స్పాట్ సిల్వర్ ధర ఔన్స్‌కు 75 డాలర్ల మార్కును దాటి కొత్త రికార్డు సృష్టించింది. భారత్‌లోనూ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో కిలో వెండి ఫ్యూచర్స్ ధర ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూ. 2,33,115 ఆల్-టైమ్ గరిష్ఠానికి చేరింది.

ఇదే జోరు కొనసాగితే వెండి త్వరలోనే ఎన్విడియాను అధిగమిస్తుందని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా విశ్వాసం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లలో ధరల మధ్య అసాధారణ వ్యత్యాసం ఉందని, సాధారణంగా డాలర్ కంటే తక్కువ ఉండే కామెక్స్, షాంఘై ఎక్స్ఛేంజ్‌ల మధ్య ధరల తేడా ఇప్పుడు దాదాపు 7 డాలర్లకు చేరిందని ఆయన వివరించారు.

భారత మార్కెట్లలో వెండి దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది డిసెంబర్ 26న రూ. 91,600గా ఉన్న కిలో వెండి ధర, ఈ ఏడాది డిసెంబర్ 26 నాటికి 153 శాతానికి పైగా పెరిగి రూ. 2,31,879కి చేరింది. ఇదే కాలంలో 10 గ్రాముల బంగారం ధర సుమారు 80 శాతం పెరిగి రూ. 77,460 నుంచి రూ. 1,39,233కు చేరుకుంది.


More Telugu News