'దండోరా' సినిమాపై మంత్రి కోమటిరెడ్డి స్పందన

  • ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'దండోరా'
  • సినిమాను వీక్షించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • సినిమా తనను ఎంతో ఆకట్టుకుందన్న మంత్రి
  • మనుషుల మధ్య సూక్ష్మమైన సంబంధాలను సహజంగా చూపించారని ప్రశంస
  • వినోదంతో పాటు విలువైన సందేశాన్ని అందించారని కితాబు

శివాజీ, నవదీప్, నందు, బింధు మాధవి కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘దండోరా’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే, సామాజిక అంశాలపై ఆధారపడిన కథతో ఆసక్తిని రేపిన ఈ సినిమా... విడుదలైన తర్వాత కూడా అదే స్థాయిలో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం, సహజమైన పాత్రలు, భావోద్వేగాలను తాకే కథనం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.


థియేటర్లలో స్పందన పెరుగుతున్న కొద్దీ, రోజురోజుకూ ఈ సినిమా ప్రదర్శితమవుతున్న స్క్రీన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. మొదటి షో నుంచే మంచి వసూళ్లు రాబడుతూ దూసుకెళుతోంది.


ఇదిలా ఉండగా, తాజాగా తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ చిత్రాన్ని వీక్షించారు. సినిమా చూసిన అనంతరం ఆయన సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తెలంగాణ మట్టిలో పుట్టిన కథగా ‘దండోరా’ తనను ఎంతో ఆకట్టుకుందని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ జీవనశైలిని, ఇక్కడి మనుషుల మధ్య ఉన్న సూక్ష్మమైన సంబంధాలను చాలా సహజంగా చూపించారని ప్రశంసించారు. మన చుట్టూ జరుగుతున్నా, చాలాసార్లు పట్టించుకోని ఒక సామాజిక సమస్యను ఈ సినిమా సున్నితంగా ప్రశ్నిస్తుందని, ప్రేక్షకులను ఆలోచించేలా చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. 


వినోదంతో పాటు విలువైన సందేశాన్ని అందించడంలో ‘దండోరా’ పూర్తిగా విజయవంతమైందని అన్నారు. ‘బలగం’ సినిమా తర్వాత అదే స్థాయిలో హృదయాన్ని తాకిన చిత్రంగా ‘దండోరా’ను కోమటిరెడ్డి అభివర్ణించారు. ఈ సినిమా ద్వారా తెలంగాణ సంస్కృతి, భావోద్వేగాలు మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాయని పేర్కొన్నారు. మంచి సందేశంతో కూడిన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ‘దండోరా’ టీమ్‌కు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.



More Telugu News