Khawaja Asif: అమెరికా మమ్మల్ని టాయిలెట్ పేపర్‌ కంటే హీనంగా వాడింది: పాక్ రక్షణ మంత్రి

Khawaja Asif says America used Pakistan worse than toilet paper
  • అమెరికాపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన ఆరోపణలు
  • జిహాద్ కోసం కాదు, అమెరికా మద్దతు కోసమే యుద్ధాల్లో పాల్గొన్నామని వెల్లడి
  • గత సైనిక పాలకుల తప్పుడు నిర్ణయాలే దీనికి కారణమని వ్యాఖ్య
ఆఫ్ఘనిస్థాన్ విషయంలో అమెరికా తమ దేశాన్ని ఒక టిష్యూ పేపర్‌లా వాడుకుని వదిలేసిందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో జాతీయ భద్రత, ఉగ్రవాదంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ గతంలో తమ దేశం అనుసరించిన విదేశాంగ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు.

"మేం ఇస్లాంను రక్షించడానికి గానీ, జిహాద్ కోసం గానీ ఆఫ్ఘన్ యుద్ధాల్లో పాల్గొనలేదు. కేవలం అమెరికా వంటి అగ్రరాజ్యం మద్దతు, రాజకీయ ప్రాబల్యం సంపాదించడానికే ఆ యుద్ధాల్లో భాగమయ్యాం" అని ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. 9/11 దాడుల తర్వాత రెండు దశాబ్దాల పాటు కేవలం అమెరికా మద్దతు కోసమే పాకిస్థాన్‌ను తాకట్టు పెట్టారని ఆయన అంగీకరించారు. ఈ విధానాల వల్ల దేశం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గత సైనిక పాలకులైన జనరల్ జియావుల్ హక్, జనరల్ పర్వేజ్ ముషారఫ్‌లు తీసుకున్న తప్పుడు నిర్ణయాలే దేశాన్ని ఈ దుస్థితికి తెచ్చాయని ఆయన ఆరోపించారు. సోవియట్ యూనియన్ విషయంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకుండా, అమెరికా విషయంలోనూ అవే తప్పులను పునరావృతం చేశామని విమర్శించారు. ఉగ్రవాదాన్ని సమూలంగా అంతం చేయడానికి దేశ ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
Khawaja Asif
Pakistan
Afghanistan
America
US relations
Terrorism
Pakistan National Assembly
Geo politics
Pervez Musharraf
Zia ul Haq

More Telugu News