విభేదాల నేపథ్యంలో, చాలాకాలం తర్వాత కాంగ్రెస్ సమావేశానికి శశిథరూర్ హాజరు

  • ఢిల్లీలో ఖర్గే అధ్యక్షతన జరిగిన సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరైన శశిథరూర్
  • వివిధ సందర్భాల్లో కేంద్రం, మోదీపై ప్రశంసలు కురిపించిన శశిథరూర్
  • పార్టీలో ఉంటూ బీజేపీని పొగడటంపై మండిపడిన కాంగ్రెస్ నాయకులు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హాజరయ్యారు. ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు శశి థరూర్ కూడా హాజరయ్యారు. గతంలో పలు సందర్భాల్లో ఆయన కేంద్ర ప్రభుత్వంపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. దాంతో కాంగ్రెస్ హైకమాండ్ కు, థరూర్ కు మధ్య దూరం పెరిగింది.

ఆయన కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు దూరంగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన 'ఓట్ చోర్ గడ్డీ ఛోడ్' ర్యాలీకి శశి థరూర్ గైర్హాజరయ్యారు. అంతేకాకుండా, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీల సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు.

ఇటీవల తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకోవడంపై ఆయన స్పందించిన తీరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆగ్రహం తెప్పించింది. కేరళ రాజధాని రాజకీయ రంగంలో ఒక ముఖ్యమైన మార్పును సూచించే బలమైన ప్రదర్శన అని, తిరువనంతపురంలో బీజేపీ సాధించిన చారిత్రాత్మక పనితీరును గుర్తించాలంటూ ఆయన పేర్కొన్నారు.

వివిధ సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని, మోదీని ప్రశంసించడం కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం నచ్చలేదు. దీంతో ఆయన వ్యవహార శైలిపై తొలుత మౌనంగా ఉన్న పార్టీ నాయకులు, ఆ తర్వాత మాత్రం ఆయనపై తీవ్రంగా స్పందించారు. ఆయన సిద్ధాంతాలు వేరుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కొనసాగుతున్నారని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్ఠానం ఆయన తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నప్పటికీ, అగ్రస్థాయి నాయకులు ఎవరూ నేరుగా ఆయనపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో నేటి సీడబ్ల్యూసీ సమావేశానికి శశి థరూర్ హాజరు కావడం చర్చనీయాంశమైంది.


More Telugu News