ఐపీఎల్‌కు బంగ్లా హింస సెగ.. ముస్తాఫిజుర్ ఆడితే పిచ్‌లు తవ్వేస్తామన్న ఉజ్జయిని సాధువులు

  • బంగ్లాలో హిందువులపై దాడులకు నిరసనగా ఐపీఎల్‌కు హెచ్చరిక
  • బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ ఆడితే పిచ్‌లు తవ్వేస్తామన్న ఉజ్జయిని సాధువులు
  • కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో ప్రచారం
  • బంగ్లాలో ఇద్దరు హిందువుల దారుణ హత్యలతో పెరిగిన ఆగ్రహం
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల ప్రభావం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై పడింది. బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్‌లో ఆడనిస్తే, మ్యాచ్‌లు జరిగే స్టేడియంలలోకి దూసుకెళ్లి పిచ్‌లను ధ్వంసం చేస్తామని ఉజ్జయినికి చెందిన పలువురు మత పెద్దలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ఇటీవల బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువులను దైవదూషణ ఆరోపణలతో దారుణంగా హత్య చేసిన ఘటనలపై భారత్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఉజ్జయినిలోని రిన్‌ముక్తేశ్వర్ మహాదేవ్ ఆలయ ప్రధాన పూజారి మహావీర్ నాథ్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో హిందువులను వేధిస్తున్నా, అక్కడి ఆటగాళ్లను భారత్‌లో ఆడనివ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అవసరమైతే తమ నాగ సాధువులు స్టేడియంలపై దాడి చేసి మ్యాచ్‌లను అడ్డుకుంటారని స్పష్టం చేశారు. ఇతర పీఠాధిపతులు కూడా ఇదే విధమైన హెచ్చరికలు చేశారు.

ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) రూ. 9.20 కోట్లకు కొనుగోలు చేసింది. బంగ్లాదేశ్ నుంచి వేలంలో అమ్ముడైన ఏకైక ఆటగాడు అతడే కావడం గమనార్హం. ఈ పరిణామంపై సోషల్ మీడియాలో కేకేఆర్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ ప్రచారం ఊపందుకుంది.

ఈ నెల‌ 18న బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్ జిల్లాలో దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని, 24న రాజ్‌బరీ జిల్లాలో అమృత్ మోండల్ అనే మరో హిందూ వ్యక్తిని మూకదాడుల్లో హత్య చేశారు. ఈ దాడులను ఖండించిన బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర శాస్త్రి.. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే బంగ్లాలో హిందువులు అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులు సురక్షితంగా లేకపోతే, వారికి భారత్ ఆశ్రయం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనలపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, నిందితుల్లో కొందరిని అరెస్టు చేసినట్లు బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు.


More Telugu News