రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణే: సీఎం చంద్రబాబు స్ట్రిక్ట్ వార్నింగ్

  • తిరుపతిలో నూతన జిల్లా పోలీసు కార్యాలయం ప్రారంభం
  • హాజరైన సీఎం చంద్రబాబు
  • రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
  • తిరుమల పవిత్రతను కాపాడాలని పోలీసులకు దిశానిర్దేశం
  • టెక్నాలజీతో నేరాలను అదుపు చేయాలని పిలుపు
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడటం, దేశ విదేశాల నుంచి తరలివచ్చే కోట్లాది మంది భక్తులకు పూర్తిస్థాయి భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని, రాజకీయ ముసుగులో రౌడీయిజం, అరాచకాలకు పాల్పడితే ఎంతటివారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. శుక్రవారం తిరుపతిలో అత్యాధునిక వసతులతో నిర్మించిన నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని (డీపీఓ) ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఆయన, నూతన కార్యాలయంలోని వసతులను పరిశీలించి, విజిటర్స్ పుస్తకంలో తన సందేశాన్ని రాశారు. కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, ఇక్కడికి వచ్చే భక్తులలో భద్రతా భావాన్ని కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అన్నారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల సమయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. 

నేరాల నియంత్రణలో ఆధునిక టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఉంచి, కీలక ఆధారాలను సేకరించాలని, నేరస్తుల ఆలోచనల కన్నా ఓ అడుగు ముందుండాలని పిలుపునిచ్చారు. 'విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్' అనే విధానాన్ని అనుసరించి, ప్రజలకు భరోసా ఇస్తూనే నేరగాళ్ల కదలికలను పసిగట్టాలని స్పష్టం చేశారు.

గత పాలనపై తీవ్ర విమర్శలు

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయని చంద్రబాబు విమర్శించారు. కొందరు రాజకీయ అండతో చెలరేగిపోయారని, సమాజంలో భయాన్ని సృష్టించే సంస్కృతిని ప్రోత్సహించారని ఆరోపించారు. 

"రోడ్లు బ్లాక్ చేయడం, కత్తులతో జంతువులను బలిచ్చి ఆ రక్తంతో పోస్టర్లు నింపడం వంటి భయానక వాతావరణాన్ని సృష్టించారు. బంగారుపాళ్యంలో మామిడి కాయలు తొక్కించడం, గుంటూరులో ఒక వ్యక్తిని కాన్వాయ్ కింద తొక్కించి పొదల్లో పడేసి, తర్వాత అంబులెన్స్‌లో తీసుకెళ్లి చంపేయడం వంటి అమానవీయ ఘటనలు చూశాం. ఇలాంటివి పునరావృతం కాకుండా సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా ఆధారాలు పక్కాగా సేకరించాలి" అని పోలీసులకు సూచించారు.

అక్రమార్కులపై కఠిన వైఖరి

అక్రమాలకు పాల్పడితే సొంత పార్టీ నాయకులనైనా జైలుకు పంపిన చరిత్ర తమదని గుర్తుచేశారు. సెటిల్‌మెంట్లు, బెదిరింపులకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడటం లేదని, కేవలం కొందరు రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని విమర్శించారు.

ఇదే సమయంలో, తిరుపతి జిల్లాలో గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం స్మగ్లింగ్‌ను సమర్థవంతంగా అరికడుతున్న పోలీసు సిబ్బందిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. పీడీ యాక్టులను ప్రయోగించి నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న తీరును కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


More Telugu News