శిల్పా శెట్టి డీప్‌ఫేక్‌ వీడియోలపై బాంబే హైకోర్టు సీరియస్

  • డీప్‌ఫేక్‌ కంటెంట్ యూఆర్ఎల్స్ తొలగించాలని అధికారులకు కోర్టు ఆదేశం
  • డీప్‌ఫేక్‌ కంటెంట్ ఆమోదయోగ్యం కాని స్థాయిలో ఉందని వ్యాఖ్య
  • ఇలాంటి నేరాలను సహించబోమన్న కోర్టు

అధునాతన సాంకేతికతను ఆయుధంగా మార్చుకున్న కొందరు సైబర్‌ ఆకతాయిలు సోషల్‌మీడియాలో హద్దులు దాటుతున్నారు. ముఖ్యంగా సినీ తారలను టార్గెట్‌ చేసుకుని డీప్‌ఫేక్‌ వీడియోలు, మార్ఫింగ్‌ ఫొటోలతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టిని లక్ష్యంగా చేసుకుని అసభ్యకర రీతిలో తయారు చేసిన ఏఐ డీప్‌ఫేక్‌ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడం తీవ్ర దుమారానికి దారి తీసింది.


ఈ ఘటనపై స్పందించిన బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శిల్పా శెట్టిని లక్ష్యంగా చేసుకుని సోషల్‌మీడియాలో పోస్టు చేసిన అసభ్యకర ఏఐ జనరేటెడ్ డీప్‌ఫేక్‌ కంటెంట్‌కు సంబంధించిన అన్ని యూఆర్‌ఎల్స్‌ను తక్షణమే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.


తన పేరు, ప్రతిష్ఠకు భంగం కలిగించేలా డీప్‌ఫేక్‌ వీడియోలు, ఫొటోలు సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ అవుతున్నాయంటూ శిల్పా శెట్టి కోర్టును ఆశ్రయించారు. వాటిలో కొన్ని కేవలం రెండు రోజుల క్రితమే అప్‌లోడ్‌ చేశారని, ఈ విషయంలో ఆలస్యం జరిగితే నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కంటెంట్‌ తన వ్యక్తిగత గోప్యత, మౌలిక హక్కులను తీవ్రంగా ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు.


ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టిన హైకోర్టు, సోషల్‌మీడియాలో ప్రచారం అవుతున్న డీప్‌ఫేక్‌ కంటెంట్‌ ఆమోదయోగ్యం కాని స్థాయిలో ఉందని, అది స్త్రీలను అవమానించేలా, మానసికంగా కలతపెట్టే విధంగా ఉందని వ్యాఖ్యానించింది. మహిళలకు తెలియకుండా, వారి సమ్మతి లేకుండా వారి చిత్రాలను ఉపయోగించి అసభ్యకరంగా ఎడిట్‌ చేయడం అత్యంత భయంకరమైన చర్యగా పేర్కొంది. ఇటువంటి నేరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని కోర్టు స్పష్టంగా తెలిపింది.



More Telugu News