వేలాది లైసెన్స్‌లు రద్దు చేసిన కాలిఫోర్నియా ప్రభుత్వం.. కోర్టుకెక్కిన భారతీయ డ్రైవర్లు

  • కాలిఫోర్నియా డిపార్టుమెంట్ ఆఫ్ మోటార్ వెహికిల్స్‌పై దావా
  • తమ జీవనాధారాన్ని ప్రమాదంలో పడేస్తోందని ట్రక్కు డ్రైవర్ల ఆందోళన
  • 20 వేల మంది వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్‌లపై ప్రభావం పడుతోందని ఆందోళన
కాలిఫోర్నియా ప్రభుత్వం వాణిజ్య లైసెన్సులు రద్దు చేయడంతో వేలాది మంది డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని ఆరోపిస్తూ భారత సంతతికి చెందిన ట్రక్కు డ్రైవర్లు కాలిఫోర్నియా డిపార్ట్ మెంట్ ఆఫ్ మోటార్ వెహికిల్స్‌పై దావా వేశారు. సిక్కు కూటమి, ఆసియన్ లా కాకస్, లా ఫర్మ్ వీల్, గోట్షాల్ కలిసి ఈ కేసును దాఖలు చేశాయి. ప్రభుత్వం చర్య తమ జీవనాధారాన్ని ప్రమాదంలో పడేస్తోందని ట్రక్కు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

లైసెన్స్ గడువు తేదీల్లో సమస్యలు ఉన్నట్లు గుర్తించిన కాలిఫోర్నియా రవాణా ఏజెన్సీ ప్రవాస డ్రైవర్లకు జారీ చేసిన లైసెన్స్‌లను రద్దు చేయాలని ఇటీవల నిర్ణయించింది. దీని కారణంగా 20 వేల మంది వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్‌లపై ప్రభావం పడింది. గత నెల 17,000 మంది డ్రైవర్లకు 60 రోజుల పాటు లైసెన్స్‌ను రద్దు చేస్తూ నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగింది.

అయితే, రవాణా ఏజెన్సీ చేసిన పొరపాట్ల కారణంగానే లైసెన్సుల రద్దు అయ్యాయని పౌర హక్కుల సంఘాలు ఆరోపించాయి. వాటిని సరిదిద్ది లైసెన్స్‌లను పునరద్ధరించాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో లైసెన్సుల రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ట్రక్కు డ్రైవర్లు కోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై స్పందించేందుకు రవాణా ఏజెన్సీ నిరాకరించింది.


More Telugu News