ఇలాంటి వివాదాలకు దూరంగా ఉండటమే మంచిది: హెబ్బా పటేల్
- ఆడవారి వస్త్రధారణపై శివాజీ వ్యాఖ్యల దుమారం
- ఇతరుల అభిప్రాయాల్లో జోక్యం చేసుకోనన్న హెబ్బా
- ఒక మహిళకు తనకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉంటుందని వ్యాఖ్య
టాలీవుడ్‌లో ముక్కుసూటి వ్యాఖ్యలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు శివాజీ మరోసారి వివాదానికి కేంద్రబిందువయ్యారు. రాజకీయాలు అయినా, సినిమా రంగానికి సంబంధించిన అంశాలైనా తన అభిప్రాయాన్ని ఏ మాత్రం మొహమాటం లేకుండా చెప్పడం శివాజీ ప్రత్యేకత. అయితే ఇటీవల ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
ఈవెంట్‌కు హాజరైన ప్రేక్షకులు, అభిమానులు సినిమా విశేషాలు వినాలని ఎదురుచూస్తున్న వేళ… శివాజీ మాత్రం అనూహ్యంగా హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై మాట్లాడడం ప్రారంభించారు. చీరలోనే అసలైన అందం దాగి ఉంటుందని, హీరోయిన్లు ఏది పడితే అది ధరించకూడదని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యల కంటే, ఆయన ఉపయోగించిన పదజాలమే వివాదానికి అసలు కారణమైంది.
ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్‌లో తీవ్ర స్పందన వ్యక్తమైంది. యాంకర్ అనసూయ భరద్వాజ్, గాయని చిన్మయి సహా పలువురు ప్రముఖులు శివాజీ మాటలను ఖండించారు. "మా బాడీ మా ఇష్టం" అంటూ వారు వ్యాఖ్యానించారు. “తప్పు దుస్తుల్లో కాదు… తప్పు చూపులో ఉంది” అంటూ మహిళా సంఘాలు, సోషల్ మీడియా యూజర్లు కూడా ఘాటుగా స్పందించారు. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని పలువురు అభిప్రాయపడ్డారు.
వివాదం తీవ్రరూపం దాల్చడంతో శివాజీ కూడా స్పందించక తప్పలేదు. ఆవేశంలో కొన్ని పదాలు నోరు జారినట్లు అంగీకరించిన ఆయన, తన మాటల వల్ల బాధపడిన మహిళలందరికీ బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. తాను ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో మాట్లాడలేదని, కానీ తన మాటలు అలా అనిపించి ఉంటే బాధ్యతగా క్షమాపణ చెబుతున్నానని స్పష్టం చేశారు.
ఈ మొత్తం వివాదం నేపథ్యంలో తాజాగా హీరోయిన్ హెబ్బా పటేల్ స్పందించడం ఆసక్తికరంగా మారింది. ఓ కార్యక్రమంలో ఈ అంశంపై ఆమెను ప్రశ్నించగా, ఇతరుల వ్యాఖ్యలపై స్పందించడం లేదా వారి వ్యక్తిగత అభిప్రాయాల్లో జోక్యం చేసుకోవడం తనకు ఇష్టం లేదని ఆమె తెలిపింది. ఇలాంటి వివాదాలకు దూరంగా ఉండటమే మంచిదని అభిప్రాయపడింది. ఒక మహిళకు తనకు నచ్చిన దుస్తులు ధరించే పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, దానిపై ఎవరూ తీర్పులు చెప్పాల్సిన అవసరం లేదని హెబ్బా స్పష్టం చేసింది.
హెబ్బా పటేల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ‘కుమారి 21ఎఫ్’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన హెబ్బా, తొలి సినిమాతోనే యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత వరుస అవకాశాలతో గ్లామర్ రోల్స్‌లో కనిపిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకుంది. స్పెషల్ సాంగ్స్‌కూ ఓకే చెబుతూ ఇండస్ట్రీలో తన స్థానం నిలబెట్టుకుంటోంది. తాజాగా హెబ్బా నటించిన ‘ఈషా’ సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది.