పెద్ద హీరోలను కూడా ట్రోల్స్ చేస్తుంటారు.. వాటి గురించి ఆలోచిస్తూ కూర్చోవద్దు: నటుడు తేజ సజ్జా

  • తన మీద వచ్చిన ట్రోల్స్‌పై స్పందించిన తేజ సజ్జా
  • ఎవరో ఏమో అన్నారని ఆలోచిస్తే ముందుకు కదలలేమని వ్యాఖ్య
  • పదేళ్ల తర్వాత అయినా వాస్తవాలు తెలుస్తాయన్న తేజ సజ్జా
తనపై వచ్చిన ట్రోల్స్‌పై యువ నటుడు తేజ సజ్జా స్పందించారు. పెద్ద పెద్ద హీరోలను కూడా ట్రోల్స్ చేస్తుంటారని, జాతీయ అవార్డులు వచ్చిన చిత్రాలపై కూడా విమర్శలు వస్తుంటాయని ఆయన అన్నారు. తాజాగా విలేకరులతో మాట్లాడిన ఆయన, ఎవరో ఏదో అన్నారని ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు కదలలేమని అన్నారు. మన ప్రతిభను నమ్ముకుంటూ ముందుకు సాగాలని పేర్కొన్నారు.

ఇప్పుడు కాకపోతే పదేళ్ల తర్వాత అయినా మనపై వచ్చిన విమర్శలకు సమాధానాలు దొరుకుతాయని, అసలు వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. దేనికైనా సమయం రావాలని, అప్పుడే మన విలువ తెలుస్తుందని అన్నారు. విమర్శించే వారి గురించి ఆలోచిస్తే పని చేయలేమని అన్నారు. ప్రేక్షకులను కొత్త కథలతో ఎలా అలరించాలో ఆలోచించాలని అన్నారు.

మనకంటూ గుర్తింపు వచ్చిన తర్వాత, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇక్కడి దాకా వచ్చానని చెప్పడం కంటే ప్రేక్షకుల వల్లే ఈ స్థాయిలో ఉన్నానని చెప్పాలని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వారికి ఒత్తిడి, ఇబ్బందులు ఉంటాయని, లేని వారికి అలాంటివేమీ ఉండవని గుర్తు చేశారు. పరిశ్రమకు రాగానే ఒకేసారి పెద్ద హీరో అయిపోవాలని అనుకోకూడదని అన్నారు.

మనతో సినిమా తీస్తే మినిమం గ్యారెంటీ ఉంటుందనుకునేలా మనం నిరూపించుకోవాలని అన్నారు. అవకాశాలు వచ్చే వరకూ పరిశ్రమలో పని చేస్తుండాలని అన్నారు. నటుడు రవితేజ పది సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారని గుర్తు చేశారు. అంత కష్టపడ్డారు కాబట్టే ఈ రోజు ఆ స్థాయికి ఎదిగారని అన్నారు. తాను చేసిన సినిమాల్లో ఏది ఇష్టమంటే చెప్పలేని పరిస్థితి అని తెలిపారు. 'హనుమాన్' వచ్చినప్పుడు బాగా చేశాననిపించిందని 'మిరాయ్' వచ్చాక అంతకంటే బాగా చేశానని అనిపించిందని తెలిపారు.


More Telugu News