ఓటు వేస్తే కారు, బంగారం, థాయ్‌లాండ్ ట్రిప్!: పుణే ఎన్నికల్లో ఆశ్చర్యపరుస్తున్న హామీలు

  • జనవరి 15న పుణే మున్సిపల్ ఎన్నికలు
  • ఓటర్లను ఆకర్షించేందుకు ఖరీదైన కానుకలు, ఉచితాలు ప్రకటిస్తున్న అభ్యర్థులు
  • కొందరు అభ్యర్థులు కొన్ని గజాల భూమిని కూడా ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం
సాధారణంగా ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ నాయకులు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వివిధ రకాల హామీలు ఇస్తుంటారు. అయితే, పుణే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు ఇస్తున్న హామీలు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. పుణే మున్సిపల్ ఎన్నికలకు మరో మూడు వారాల గడువు ఉండటంతో అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు పలువురు ఖరీదైన కానుకలు, ఉచితాలను ప్రకటిస్తున్నారు.

కొందరు అభ్యర్థులు పట్టుచీరలు, బైక్‌లు, లగ్జరీ కార్లు, బంగారు ఆభరణాలు, విదేశీ ట్రిప్పులు వంటి ఆఫర్లు ఇస్తున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఓట్ల కోసం లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. పుణే మున్సిపల్ ఎన్నికలు జనవరి 15న జరగనున్నాయి.

ఒక వార్డులో ఓ సీనియర్ నేత మహిళలను ఆకర్షించేందుకు కొన్ని గజాల భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇందుకోసం లక్కీ డ్రా నిర్వహిస్తున్నారని సమాచారం. మరో అభ్యర్థి నూతన దంపతులకు థాయ్‌లాండ్ ట్రిప్పును ఆఫర్ చేస్తుండగా, మరికొన్ని వార్డుల్లో లక్కీ డ్రా పేరుతో బైక్‌లు, ఎస్‌యూవీలు, బంగారు ఆభరణాలు ఇస్తున్నారని తెలుస్తోంది. ఇంకొన్ని వార్డుల్లో కుట్టుమిషన్లు, సైకిళ్లు పంపిణీ చేసినట్లు సమాచారం. అయితే, అభ్యర్థుల ఖర్చుపై నిఘా పెట్టాలని పలువురు సూచిస్తున్నారు.


More Telugu News