నడకతో బరువు తగ్గడం చాలా ఈజీ.. ఈ లెక్క తెలిస్తే మీరే ఒప్పుకుంటారు!

  • ఒక కిలో కొవ్వు కరగాలంటే సుమారు 7,700 క్యాలరీలు బర్న్ చేయాలంటున్న నిపుణులు 
  • ఇందుకోసం దాదాపు 1.5 లక్షల అడుగులు నడవాలని సూచన
  • రోజూ 10-15 వేల అడుగులు నడిస్తే 10-12 రోజుల్లో కిలో బరువు తగ్గే ఛాన్స్
  • బరువు తగ్గడంలో స్థిరత్వం చాలా ముఖ్యమని నిపుణుల సలహా
రోజూ వాకింగ్ చేస్తున్నా బరువులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదా? చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. బరువు తగ్గడానికి అవసరమైన దూరం నడవకపోవడమే దీనికి కారణం కావొచ్చు. అయితే, ఒక కిలో కొవ్వును కరిగించేందుకు ఓ సింపుల్ లెక్క ఉందని ఫ్యాట్ లాస్ నిపుణురాలు అంజలి సచన్ తెలిపారు. అదనపు బరువును తగ్గించుకోవడానికి నడక అత్యంత ప్రభావవంతమైన, సులభంగా కొనసాగించగలిగే మార్గమని ఆమె చెబుతున్నారు. కిలో కొవ్వు కరగాలంటే ఎంత నడవాలో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలో పంచుకున్నారు.

నడక వెనుక ఉన్న సైన్స్ ఇదే!
అంజలి సచన్ ప్రకారం ఒక కిలో కొవ్వు అంటే సుమారు 7,700 క్యాలరీలతో సమానం. ఇది శరీరంలో నిల్వ ఉన్న నిజమైన కొవ్వు అని, నీరు లేదా ఇతర తాత్కాలిక బరువు కాదని ఆమె స్పష్టం చేశారు. "నిజమైన కొవ్వు కరగడానికి సమయం పడుతుంది. కానీ, ఒక్కసారి కరిగాక అది తిరిగి రాదు" అని ఆమె తెలిపారు.

సాధారణంగా 1,000 అడుగులు నడిస్తే 50 నుంచి 70 క్యాలరీలు ఖర్చవుతాయని అంజలి వివరించారు. ఈ లెక్కన, ఒక కిలో కొవ్వును కేవలం నడక ద్వారా కరిగించాలంటే సుమారు 1,28,000 నుంచి 1,50,000 అడుగులు వేయాల్సి ఉంటుంది. ఈ సంఖ్య పెద్దదిగా అనిపించినా, దీన్ని సులభంగా సాధించవచ్చని ఆమె పేర్కొన్నారు. "రోజూ 10,000 నుంచి 15,000 అడుగులు నడిస్తే, 10 నుంచి 12 రోజుల్లో ఒక కిలో కొవ్వును కరిగించవచ్చు. ఇది ఆహార నియమాలు, ఇతర వర్కౌట్లు కాకుండా కేవలం నడక ద్వారానే సాధ్యం" అని ఆమె చెప్పుకొచ్చారు.

నడకతో లాభాలెన్నో..
బరువు తగ్గడంలో స్థిరత్వం చాలా ముఖ్యమని, ఇది ఒక్క రోజులో జరిగే మ్యాజిక్ కాదని అంజలి అన్నారు. భారీ వర్కౌట్లలా కాకుండా నడక వల్ల ఆకలి పెరగదని, హార్మోన్ల సమతుల్యత దెబ్బతినదని, అలసట ఉండదని తెలిపారు. నడక క్యాలరీలను బర్న్ చేయడమే కాకుండా, మానసిక ఆరోగ్యాన్ని, మూడ్‌ను మెరుగుపరుస్తుందని వివరించారు. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి నడక అత్యంత సులభమైన, సురక్షితమైన మార్గమని ఆమె సిఫార్సు చేస్తున్నారు.


More Telugu News