సౌదీ అరేబియాలో అరుదైన హిమపాతం.. ప్రపంచానికి ప్రమాద ఘంటికలు!

  • భూగోళంపై ముంచుకొస్తున్న ముప్పునకు ఇది సంకేతమంటున్న శాస్త్రవేత్తలు
  • వాతావరణ వ్యవస్థలో భారీ మార్పులకు హెచ్చరిక అని ఆందోళన
  • రుతుపవనాల శైలి దెబ్బతింటోందంటున్న నిపుణులు
  • దేశంలో ఇటీవలి అసాధారణ పరిస్థితులకు ఇదే కారణమని వ్యాఖ్య
ఎడారి దేశం సౌదీ అరేబియాలో ఈ శీతాకాలం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తబూక్ వంటి ఉత్తర ప్రాంతాలు తమ ఎర్రటి ఇసుక తిన్నెలపై తెల్లని మంచు దుప్పటిని కప్పుకున్నాయి. పర్వత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయి, కొండలన్నీ తెల్లగా మారిపోయాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ అందమైన దృశ్యాలు కేవలం ఒక అద్భుతం మాత్రమే కాదు.. భారత్ సహా ప్రపంచమంతటా వాతావరణ వ్యవస్థలో వస్తున్న భారీ మార్పులకు హెచ్చరిక అని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాతావరణ మార్పు అంటే కేవలం ఎండలు పెరగడం మాత్రమే అని చాలామంది భావిస్తారు. కానీ, అసలు విషయం అది కాదని నిపుణులు చెబుతున్నారు. భూగోళం వేడెక్కుతున్న కొద్దీ, వాతావరణంలో తేమ, శక్తి పెరిగి దశాబ్దాలుగా ఉన్న రుతుపవనాల శైలిని దెబ్బతీస్తుంది. దీనివల్లే మునుపెన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రమైన ఎండలు, అకస్మాత్తుగా కురిసే అతి భారీ వర్షాలు, సౌదీ వంటి చోట్ల విచిత్రంగా కురిసే మంచు వంటి విపరీత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ ఏడాది భారతదేశంలో కూడా ఇలాంటి అసాధారణ పరిస్థితులు కనిపించాయి. ఉత్తర, మధ్య భారత్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కింలలో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వరదలు సంభవించాయి. వ్యవసాయం, నీటి వనరులు, విద్యుత్ డిమాండ్ అన్నీ రుతువుల ఆధారంగానే సాగుతాయి. అయితే, ఈ రుతుక్రమం తలకిందులు కావడం వల్ల పంట నష్టాలు, మరణాలు సంభవిస్తున్నాయి. 


More Telugu News