విజయ్ హజారేలో కోహ్లీ, రోహిత్ శతకాలు.. బీసీసీఐపై అభిమానుల ఫైర్.. కార‌ణ‌మిదే!

  • సిక్కింపై రోహిత్ 155, ఆంధ్రపై కోహ్లీ 131 పరుగులు
  • స్టార్ ఆటగాళ్ల మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయని బీసీసీఐ
  • విడుదల చేసిన హైలైట్స్ వీడియో నాణ్యతపై తీవ్ర విమర్శలు
  • బీసీసీఐ తీరుపై సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహం
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దేశవాళీ టోర్నీ విజయ్ హజారేలో సెంచరీలతో దుమ్మురేపారు. అయితే, వారి అద్భుతమైన ఇన్నింగ్స్‌లను ప్రత్యక్షంగా చూసే అవకాశం అభిమానులకు లభించలేదు. ఈ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయడంలో బీసీసీఐ విఫలం కావడంతో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

నిన్న‌ జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లలో ఈ ఇద్దరు ఆటగాళ్లు బరిలోకి దిగారు. ఏడేళ్ల తర్వాత ఈ టోర్నీ ఆడుతున్న రోహిత్ శర్మ.. జైపూర్‌లో సిక్కిం జట్టుపై ముంబై తరఫున ఆడి కేవలం 94 బంతుల్లో 155 పరుగుల భారీ శతకం బాదాడు. మరోవైపు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ.. బెంగళూరులో ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించి 101 బంతుల్లో 131 పరుగులు చేశాడు.

అయితే, ఈ కీలక మ్యాచ్‌లను ప్రసారం చేయకుండా బీసీసీఐ కేవలం రెండు మ్యాచ్‌లకే పరిమితమైంది. దీంతో స్టార్ ఆటగాళ్ల బ్యాటింగ్ చూసే అవకాశం కోల్పోయిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత బీసీసీఐ విడుదల చేసిన హైలైట్స్ వీడియో నాణ్యత చాలా తక్కువగా ఉండటంతో విమర్శలు మరింత పెరిగాయి. ఎవరో పాతకాలం కెమెరాతో రికార్డ్ చేసినట్లుందంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు.

సిక్కిం నిర్దేశించిన 236 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఇది అతనికి లిస్ట్-ఏ క్రికెట్‌లో 37వ శతకం. ఇక, ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో 299 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లీ అద్భుత సెంచరీతో క‌దంతొక్కాడు. అతనికిది లిస్ట్-ఏ కెరీర్‌లో 58వ సెంచరీ కావడం విశేషం.


More Telugu News