బాధితులను నిందించొద్దు.. శివాజీ వ్యాఖ్యలకు నిధి అగర్వాల్ కౌంటర్

  • హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు
  • శివాజీ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించిన నిధి అగర్వాల్
  • బాధితులను నిందించడం సరికాదంటూ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై తాజాగా నటి నిధి అగర్వాల్ స్పందించారు. వేధింపులకు గురైన బాధితులను నిందించడం సరికాదని, ఆయన వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పరోక్షంగా చురకలంటించారు.

ఇటీవల 'దండోరా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ.. హీరోయిన్లు ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు మంచి బట్టలు వేసుకోవాలని సూచించారు. అభ్యంతరకరంగా దుస్తులు ధరించడం వల్లే అభిమానులు ఎగబడుతున్నారని, 'మనకెందుకీ దరిద్రం' అంటూ వ్యాఖ్యానించారు. అంతకుముందు అందం చీరకట్టులోనే ఉంటుందని, 'సామాన్లు' కనిపించేలా బట్టలు వేసుకోవద్దని ఆయన చేసిన కామెంట్స్‌ తీవ్ర దుమారం రేపాయి. ఆ తర్వాత ఆయన క్షమాపణలు కూడా చెప్పారు.

'రాజాసాబ్' మూవీ ఈవెంట్‌లో నిధి అగర్వాల్‌తో, మరో సందర్భంలో సమంతతో అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించిన ఘటనల నేపథ్యంలో శివాజీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్ నుంచి నిధి, సమంత ఇద్దరూ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు.

ఈ క్రమంలో శివాజీ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో స్పందించారు. "బాధితులను తప్పుపట్టడం సరైంది కాదు. ఈ కామెంట్స్ తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి" అని ఆమె క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ శివాజీని ఉద్దేశించి పెట్టిందేనని స్పష్టంగా అర్థమవుతోంది. ఒకరి దుస్తుల కారణంగా వేధింపులు జరుగుతాయని చెప్పడం విక్టిమ్ బ్లేమింగ్ కిందకే వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిధి అగర్వాల్ స్పందనతో ఈ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది. దీనిపై శివాజీ ఎలా స్పందిస్తారో చూడాలి.


More Telugu News