మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్‌.. మూడేళ్ల హామీ నెరవేర్చిన డిప్యూటీ సీఎం

  • ఇచ్చిన మాట ప్ర‌కారం ఇండ్ల నాగేశ్వరమ్మను క‌లిసిన జ‌న‌సేనాని 
  • ఆమెకు రూ.50 వేల సాయం, మనవడి చదువుకు రూ.లక్ష ప్ర‌క‌ట‌న‌
  • ప్రతి నెలా రూ.5 వేల వ్యక్తిగత సహాయానికి హామీ ఇచ్చిన ప‌వ‌న్
  • ఇప్పటం గ్రామంలో భావోద్వేగ వాతావరణం
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామాన్ని సందర్శించారు. మూడేళ్ల క్రితం ఇచ్చిన హామీ మేరకు అక్కడ నివసిస్తున్న వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మను ఆయన కలిశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న పవన్ కల్యాణ్, ఆప్యాయంగా ఆమెను ఆలింగనం చేసుకున్నారు. 

ఈ సందర్భంగా నాగేశ్వరమ్మకు రూ.50 వేల ఆర్థిక సహాయం అందిస్తానని, ఆమె మనవడి విద్య కోసం మరో రూ.లక్ష అందజేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అంతేకాదు తన జీతం నుంచి ప్రతి నెలా రూ.5 వేల సాయం చేస్తానని హామీ ఇచ్చారు. “నాలుగు రోజులుగా రావాలనుకున్నాను కానీ అధికారిక పనుల వల్ల వీలుకాలేదు. ఈరోజు మాత్రం మీకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అన్ని పనులు వాయిదా వేసుకుని వచ్చాను” అంటూ ప‌వ‌న్‌ భావోద్వేగంగా మాట్లాడారు.

2022 నవంబర్‌లో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ కోసం భూములు ఇచ్చిన గ్రామస్తుల ఇళ్లు అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో నాగేశ్వరమ్మ పవన్ కల్యాణ్‌ను కలిసి, ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన ఇంటికి రావాలని కోరగా ఆయన మాటిచ్చారు.

2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో పవన్ కల్యాణ్ తన మాటను నిలబెట్టుకుంటూ ఇప్పటం గ్రామానికి వచ్చారు. ఇది ఆయన రాజకీయ జీవితానికి మాత్రమే కాదు, వ్యక్తిగత విలువలకు కూడా నిదర్శనంగా నిలిచిందని గ్రామస్తులు అంటున్నారు.


More Telugu News