హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఏఐతో మాస్ కాపీయింగ్.. ఇద్దరు అరెస్ట్

  • షర్టు బటన్లలో అమర్చిన మైక్రో స్కానర్లతో ప్రశ్నాపత్రం స్కాన్
  • ఏఐ టెక్నాలజీ ద్వారా బయట నుంచే సమాధానాలు పంపినట్లు గుర్తింపు
  • హర్యానాకు చెందిన ఇద్దరు యువకులు అరెస్ట్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిర్వహించిన జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (నాన్-టీచింగ్) పోస్టుల నియామక రాత పరీక్షలో హైటెక్ కాపీయింగ్ ఘటన కలకలం రేపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డ ఇద్దరు అభ్యర్థులను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు.


ఈ నెల 21న జరిగిన పరీక్షలో హర్యానా రాష్ట్రానికి చెందిన 30 ఏళ్ల అనిల్ అనే అభ్యర్థి అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నట్లు ఇన్విజిలేటర్లు గమనించారు. పరిశీలించగా, అతను తన షర్టు బటన్లలో చిన్న మైక్రో స్కానర్ అమర్చి, ప్రశ్నాపత్రాన్ని స్కాన్ చేసి బయట ఉన్న వ్యక్తులకు పంపుతున్నట్టు తేలింది. ఆ స్కాన్ చేసిన ప్రశ్నలను బయట ఉన్న వ్యక్తులు AI టెక్నాలజీ ఉపయోగించి వెంటనే సమాధానాలుగా మార్చి, పరీక్ష హాల్‌లో ఉన్న అభ్యర్థికి పంపినట్లు అధికారులు నిర్ధారించారు.


ఇదే తరహాలో మరో హర్యానా యువకుడు సతీశ్ కూడా అదే విధానాన్ని అనుసరిస్తూ కాపీయింగ్‌కు పాల్పడినట్లు ఇన్విజిలేటర్లు గుర్తించారు. వెంటనే యూనివర్సిటీ అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. యూనివర్శిటీ రిజిస్ట్రార్ దేవేశ్ నిగమ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాపీయింగ్‌కు ఉపయోగించిన మైక్రో స్కానర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


ఈ ఘటనతో పరీక్షల భద్రతపై, టెక్నాలజీ దుర్వినియోగంపై తీవ్ర చర్చ మొదలైంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరింత కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.



More Telugu News