ఈ విషయంలోకి యాంకర్ అనుసూయ ఎందుకొచ్చారు: హీరోయిన్ల దుస్తుల అంశంపై శివాజీ

  • సుమ, ఝాన్సీ, ఉదయభాను మంచి దుస్తులు వేసుకుంటారన్న శివాజీ
  • నేను ఎవరి పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించలేదన్న శివాజీ
  • అనసూయను అనాల్సిన అవసరం నాకేమొచ్చిందన్న శివాజీ
  • నా భార్యకు, ఫోన్ చేసిన సుప్రియకు క్షమాపణ చెప్పానన్న శివాజీ
  • అందరూ ఫిర్యాదు చేశారు కానీ, అలా ఎందుకు అన్నావని ఎవరూ అడగలేదని ఆవేదన
హీరోయిన్ల దుస్తులపై తాను చేసిన వ్యాఖ్యల మధ్యలోకి యాంకర్ అనుసూయ ఎందుకు వచ్చారని, అసలు తాను ఆమెను ఏమైనా అన్నానా అని సినీ నటుడు శివాజీ ప్రశ్నించారు. హీరోయిన్ల దుస్తుల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలపై అనసూయ, చిన్మయి వంటి వారు స్పందించడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. సుమ, ఝాన్సీ, ఉదయభాను వంటి తెలుగు యాంకర్లు మంచి దుస్తులు వేసుకుంటారని ఆయన గుర్తు చేశారు.

నెటిజన్ల నుంచి వచ్చే స్పందనను బట్టి వారు కూడా తమ వేషధారణను మార్చుకుంటారని ఆయన అన్నారు. హీరోయిన్ల బట్టల విషయంలో తాను ప్రత్యేకంగా ఎవరి పేరును ప్రస్తావించలేదని శివాజీ గుర్తు చేశారు. "మిమ్మల్ని అనే అవసరం నాకేంటి? నాకేంటి అనసూయ గారు? మీరు ఇందులోకి ఎందుకు వచ్చారు? నేను మిమ్మల్ని ఏమైనా అన్నానా?" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిధి అగర్వాల్ పట్ల అభిమానుల ప్రవర్తన వల్ల తాను బయటి నుంచి వచ్చిన హీరోయిన్ల దుస్తుల విషయంలో అలా మాట్లాడానని అన్నారు.

నేను తప్పుగా మాట్లాడానని గుర్తించాక మొదట నా భార్యకే క్షమాపణ చెప్పానని ఆయన అన్నారు. వెంటనే ఒక వీడియో రికార్డు చేసి చిత్ర బృందానికి కూడా పంపించానని అన్నారు. అనవసరంగా దీనిని పెద్దదిగా చేయవద్దని కోరానని తెలిపారు. అర్ధరాత్రి తర్వాత కొన్ని ట్వీట్లు చూశానని, గాయని చిన్మయి, అనసూయ గారికి కొందరు ట్యాగ్ చేయడం చూశానని అన్నారు.

దుస్తుల విషయంలో తాను మాట్లాడిందానికి కట్టుబడి ఉన్నానని, కానీ రెండు పదాల విషయంలో తప్పు దొర్లింది కాబట్టి వారు ఏమన్నా తాను సర్దుకుపోవాల్సిందేనని అన్నారు. ఇంకా క్షమాపణలు చెప్పవలసి వస్తే అందుకు సిద్ధమేనని అన్నారు. తన వల్ల తన భార్య, పిల్లలు ఇబ్బంది పడకూడదని అన్నారు. కొందరు ఆవేశంగా 'మా'కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారని, కానీ తనతో క్షమాపణ చెప్పిద్దామని మాత్రం ఎవరూ అనలేదని పేర్కొన్నారు.

ఎవరికి వారు ఏపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారని అన్నారు. కానీ ఎవరు కూడా ఇలా మాట్లాడారేమిటని అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను అడిగితే సమాధానం చెప్పేవాడినని అన్నారు. ఒక్క సుప్రియ గారు ఫోన్ చేస్తే తాను క్షమాపణ చెప్పానని వెల్లడించారు.


More Telugu News