ముంబై మున్సిపల్ ఎన్నికలు.. చేతులు కలిపిన ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే

  • కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన శివసేన (యూబీటీ, ఎంఎన్ఎస్)
  • ముంబైకి మరాఠీ మేయర్ వస్తారన్న రాజ్ ఠాక్రే
  • ముంబై మాతోనే ఉంటుందన్న ఉద్దవ్ ఠాక్రే
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు దశాబ్దాల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలుసుకున్నారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో శివసేన (యూబీటీ), ఎంఎన్ఎస్ కలిసి పోటీ చేస్తాయని ఇరువురు అగ్రనేతలు ప్రకటించారు. ముంబైకి మరాఠీ మేయర్ వస్తారని రాజ్ ఠాక్రే పేర్కొనగా, ఏం జరిగినా ముంబై తమతోనే ఉంటుందని ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు.

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు 28 కార్పొరేషన్లకు జనవరి 15న పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే, 32 జిల్లాల కౌన్సిళ్లు, 336 పంచాయతీ సమితులకు ఒకే విడతలో ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి.

ఇదొక చారిత్రాత్మక ప్రారంభమని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అభివర్ణించారు. బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో అసంతృప్తితో ఉన్న వారు తమతో కలిసి రావొచ్చని ఆహ్వానించారు. 2005లో విడిపోయిన వీరు దాదాపు 20 ఏళ్ల తర్వాత తిరిగి కలుసుకున్నారు. కొన్ని నెలల క్రితం తొలిసారి ఈ ఇద్దరు ఒకే వేదికపై కనిపించారు.

ఠాక్రే సోదరుల కలయికపై బీజేపీ స్పందించింది. వారి పొత్తు చారిత్రక ఓటమికి నాంది అవుతుందని పేర్కొంది. ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్, శరద్ పవార్‌లతో కలిసిన విషయాన్ని ఈ సందర్భంగా బీజేపీ గుర్తు చేసింది. శివసేనతో కలిస్తే రాజ్ ఠాక్రేకు ఓటమి తప్ప మరేమీ ఉండదని అన్నారు.


More Telugu News