‘బాహుబలి’ రాకెట్ ప్రయోగం విజయవంతంపై ఇస్రోకు ఏపీ గ‌వ‌ర్న‌ర్‌, సీఎం అభినందనలు

  • శ్రీహరికోట నుంచి ప్ర‌యోగించిన‌ ఎల్వీఎం3-ఎం6 మిషన్ ఘన విజయం
  • కక్ష్యలోకి చేరిన అత్యంత భారీ ఉపగ్రహంగా బ్లూబర్డ్ బ్లాక్-2 రికార్డు
  • భారత వాణిజ్య అంతరిక్ష సామర్థ్యానికి అంతర్జాతీయ గుర్తింపు
శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈరోజు విజయవంతంగా ప్రయోగించిన ఎల్వీఎం3-ఎం6 మిషన్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహమైన బ్లూబర్డ్ బ్లాక్-2ను కక్ష్యలోకి చేర్చిన ఈ ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు విజయవంతం చేశారు.

ఈ ఘన విజయంపై ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భారత భూభాగం నుంచి ఇప్పటివరకు ప్రయోగించిన అత్యంత భారీ ఉపగ్రహమిదేనని పేర్కొన్న ఆయన, ఈ మిషన్ దేశానికి మరో మైలురాయిగా నిలిచిందన్నారు. 

సీఎం చంద్రబాబు నాయుడు కూడా ‘ఎక్స్’ వేదికగా ఇస్రో బృందాన్ని అభినందించారు. అత్యంత భారీ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ద్వారా భారత వాణిజ్య అంతరిక్ష సామర్థ్యం మరింత బలోపేతమైందన్నారు. ప్రపంచ స్థాయిలో విశ్వసనీయ లాంచ్ భాగస్వామిగా భారత్‌కు మరింత గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.

రాష్ట్ర ఐటీ, హెచ్‌ఆర్‌డీ శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా ‘బాహుబలి’గా పేరుగాంచిన ఎల్వీఎం3 రాకెట్ విజయంపై శాస్త్రవేత్తలను ప్రశంసించారు. ఇది భారత వాణిజ్య ప్రయోగాల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఘట్టమని అన్నారు.

ఇక వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. ఈ విజయం భారత శాస్త్రీయ ప్రతిభకు నిదర్శనమని, దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు.


More Telugu News