వేణు స్వామికి నటి ప్రగతి కౌంటర్
- పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మెడల్స్ సాధించిన ప్రగతి
- ప్రగతి విజయం వెనుక తన పూజలు ఉన్నాయన్న వేణుస్వామి
- కఠిన సాధన, నిరంతర కృషి వల్లే తాను గెలిచానన్న ప్రగతి
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రగతి... క్రీడారంగంలో కూడా సత్తా చాటుతున్నారు. తాజాగా టర్కీలో జరిగిన ఏషియన్ ఛాంపియన్‌షిప్ పవర్‌లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో తానేంటో నిరూపించుకున్నారు. ఈ పోటీల్లో ఆమె ఒక బంగారు, మూడు రజత పతకాలు గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచారు. నటనలోనే కాకుండా, క్రీడల్లోనూ తన ప్రతిభను చాటుతూ... ఏదైనా సాధించడానికి వయసు అడ్డంకి కాదని నిరూపించారు.
ఈ ఘన విజయం తర్వాత, ప్రగతి చుట్టూ ఓ వివాదం చోటుచేసుకుంది. ప్రగతి సాధించిన మెడల్స్ వెనుక తన పూజల ప్రభావం ఉందంటూ జ్యోతిష్యుడు వేణుస్వామి వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే, వ్యాఖ్యలకు ప్రగతి గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
పూజల వల్లే తాను విజయం సాధించానని వేణుస్వామి చెప్పడం సరికాదని ప్రగతి అన్నారు. కఠిన సాధన, నిరంతర కృషి వల్లే తాను ఈ విజయాన్ని సాధించగలిగానని చెప్పారు. వేణుస్వామి వద్ద రెండున్నరేళ్ల క్రితం తాను పూజలు చేయించుకున్న విషయం నిజమేనని... అయితే, తాను మానసికంగా కష్టమైన దశలో ఉన్నప్పుడు ఆ పూజలు చేయించుకున్నానని తెలిపారు. తన స్నేహితుల సూచనతోనే తాను ఆయన వద్దకు వెళ్లానని... టైమ్ బాగోలేనప్పుడు ఇలాంటి వాటిని నమ్మడం సహజమేనని చెప్పారు.
వేణుస్వామి పూజల వల్ల సినీ రంగంలో కానీ, క్రీడా రంగంలో కానీ తనకు ఎలాంటి ప్రగతి కనిపించలేదని ప్రగతి స్పష్టం చేశారు. ఎప్పుడో జరిగిన పూజలకు, ఇప్పుడు తాను సాధించిన విజయానికి ముడిపెడుతూ... తన విజయానికి ఆ పూజలే కారణమన్నట్టుగా చెప్పుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. తన విజయాన్ని ఇతరుల ఖాతాలో వేసుకోవడాన్ని వారి సంస్కారానికే వదిలేస్తున్నానని చెప్పారు.