మ‌రోసారి వైభ‌వ్ ఊచ‌కోత‌.. 36 బంతుల్లోనే శ‌త‌కం.. ఏబీడీ ప్రపంచ రికార్డు బ్రేక్

  • వేగవంతమైన లిస్ట్-ఏ సెంచరీ న‌మోదు చేసిన రెండో భార‌తీయ ప్లేయ‌ర్‌గా వైభ‌వ్‌
  • లిస్ట్-ఏ క్రికెట్‌లో శతకం చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు
  • 54 బంతుల్లో 150 ర‌న్స్‌.. ఏబీ డివిలియర్స్ ప్రపంచ రికార్డు బ్రేక్ 
  • భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణంగా మారుతున్న సూర్యవంశీ
అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై ఓటమి బాధను పక్కన పెట్టిన 14 ఏళ్ల యువ సంచ‌ల‌నం వైభవ్ సూర్యవంశీ, విజయ్ హజారే ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించాడు. బుధవారం బిహార్, అరుణాచల్ ప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వైభవ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో అద‌ర‌గొట్టాడు. 

మ్యాచ్ మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడిన వైభవ్, అరుణాచల్ బౌలర్లను ఊచ‌కోత కోశాడు. కేవలం 36 బంతుల్లోనే శతకం పూర్తి చేసి సంచలన రికార్డు నెలకొల్పాడు. ఈ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉండటం విశేషం. దీంతో లిస్ట్-ఏ క్రికెట్‌లో భారతీయులలో వేగవంతమైన శతకాల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

14 ఏళ్ల 272 రోజుల వయసులోనే పురుషుల లిస్ట్-ఏ క్రికెట్‌లో శతకం సాధించిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. అలాగే 54 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేసి, ఏబీ డివిలియర్స్ (64 బంతులు) ప్రపంచ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. 

ఇక‌, ఇప్పటికే వైభవ్ తన కెరీర్‌లో ఎన్నో రికార్డులను చెరిపేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్రపై 61 బంతుల్లో శతకం, ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై 58 బంతుల్లో యూత్ టెస్ట్ శతకం, 12 ఏళ్ల వయసులోనే రంజీ ట్రోఫీలో అరంగేట్రం వంటి ఘనతలు అతడిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. సచిన్, యువరాజ్‌ల రికార్డులను సైతం అధిగమించిన ఈ యువ‌ క్రికెటర్ భారత క్రికెట్‌కు భవిష్యత్తు ఆశాకిరణంగా మారుతున్నాడు.

లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీలు:
29 బంతులు: జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ (దక్షిణ ఆస్ట్రేలియా vs టాస్మానియా, 2023)
31 బంతులు: ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్, 2015)
35 బంతులు: అన్మోల్‌ప్రీత్ సింగ్ (పంజాబ్ vs అరుణాచల్ ప్రదేశ్, 2024)
36 బంతులు: వైభవ్ సూర్యవంశీ (బీహార్ vs అరుణాచల్ ప్రదేశ్, 2025)
36 బంతులు: కోరీ ఆండర్సన్ (న్యూజిలాండ్ vs వెస్టిండీస్, 2014)
36 బంతులు: గ్రాహం రోజ్ (సోమర్సెట్ vs డెవాన్, 1990)
37 బంతులు: షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్ vs శ్రీలంక, 1996)
40 బంతులు: గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ (ఆస్ట్రేలియా vs నెదర్లాండ్స్, 2023)
40 బంతులు: యూసుఫ్ పఠాన్ (బరోడా vs మహారాష్ట్ర, 2010)


More Telugu News