వైసీపీని వీడుతున్నారనే వార్తలపై బుట్టా రేణుక స్పందన

  • వైసీపీని వీడుతున్నాననే ప్రచారంలో నిజం లేదన్న రేణుక
  • తనను రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం
  • వైసీపీ బలోపేతమే తన లక్ష్యమని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయాల్లో జంపింగ్‌లకు తెరలేచింది. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. ఈ నేపథ్యంలో మరికొందరు కీలక నేతలపై కూడా పార్టీ మార్పు వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.


తాజాగా, వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారని, జనసేన లేదా బీజేపీలో చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. జరుగుతున్న ప్రచారంపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేకే, ప్రజల్లో తనకు ఉన్న ఆదరణను చూసి ఓర్వలేకే ఇలాంటి అసత్య వార్తలు పుట్టిస్తున్నారని బుట్టా రేణుక మండిపడ్డారు. తనపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నవారే రేపు ప్రజల ముందు నవ్వులపాలవుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.


2019లో మళ్లీ వైసీపీలో చేరినప్పటి నుంచి ఎలాంటి పదవులు, ఆశలు లేకుండా పార్టీ కోసం పనిచేశానని ఆమె గుర్తు చేశారు. పార్టీ బలోపేతమే తన లక్ష్యమని, జగన్ నాయకత్వంపై తనకు అపారమైన నమ్మకం ఉందని పేర్కొన్నారు. జగన్‌ను విడిచి వెళ్లాల్సి వస్తే అదే తన రాజకీయ జీవితానికి చివరి రోజవుతుందని అన్నారు.



More Telugu News